మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. ప్రగతిభవన్ వేదికగా ఉదయం 11:30 గంటల నుంచి సమావేశాలు జరగనున్నాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్యారోగ్య, విద్యా, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై సీఎం కూలంకషంగా చర్చించనున్నారు.
క్లాసుల ప్రారంభంపై నిర్ణయం..
కరోనా కారణంగా రాష్ట్రంలో మూతపడిన పాఠశాలలు, కళాశాలల ప్రారంభంపై సమావేశంలో చర్చిస్తారు. క్లాసులు ప్రారంభించాల్సిన తరగతులు, నిర్వహణా విధానంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై సమీక్షించి రాష్ట్రంలో తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు.
రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారం..
రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను నేటి సమావేశంలో సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్-బీలో చేర్చిన భూముల పరిష్కారం తదితర విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
టీకా పంపిణీపై..
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి.. నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తారు. ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించే కార్యాచరణపై ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తారు. వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యతా క్రమంలో పౌరులకు టీకా వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
పల్లె, పట్టణ ప్రగతి..
అటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును కూడా సీఎం సమీక్షిస్తారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతి, నిధులు, వాటి వినియోగం తదితర అంశాలపై మంత్రులు, కలెక్టర్లతో చర్చిస్తారు. హరితహారం కార్యక్రమం అమలుపైనా సమావేశంలో సమీక్షిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల చర్చిస్తారు. వీటితో పాటు ఇతర అంశాలపైనా ముఖ్యమంత్రి చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ నేడు
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎస్ సోమేశ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం సీఎం కేసీఆర్‌తో భేటీ కానుంది. మంత్రులు, కలెక్టర్లతో జరిగే సమావేశానికి ముందుగానే ఈ కమిటీ సీఎంను కలవనుంది. ఉద్యోగులకు వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు, కారుణ్య నియామకాలు, పదవీ విరమణ ప్రయోజనాలు అందించడం వంటి అంశాలపై ఆయనకు నివేదించనున్నట్లు తెలిసింది. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి రప్పించేందుకు చేపట్టిన చర్యల పురోగతిని వివరించనున్నారు. పీఆర్సీపై అధ్యయనం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశ తేదీలు తదితర అంశాలపై ఈ సందర్భంగా స్పష్టత వచ్చే అవకాశముంది.
బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం
రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాలపై సీఎం.. మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో చర్చించి తేదీలను ఖరారు చేసే వీలున్నట్లు తెలిసింది. గత ఏడాది సమావేశాలు మార్చి 6న ప్రారంభం కాగా 8న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు
ఇవీ చూడండి: ఉచిత తాగునీటి పథకానికి మార్గదర్శకాలు విడుదల