తన బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ వెనుక రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారం ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీబీఐ కోర్టుకు(CBI COURT) నివేదించారు. అలాంటి వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ చట్టప్రకారం విచారణార్హం కాదని పేర్కొన్నారు. అఫిడవిట్‌లో రఘురామ చేసిన ఆరోపణలు, వాడిన భాషను పరిశీలిస్తే నేర న్యాయవ్యవస్థను దురుద్దేశపూరితంగా వాడుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు వెల్లడవుతుందన్నారు.
జగన్ అధికార దుర్వినియోగంతో బెయిలు షరతులను (JAGAN BAIL) ఉల్లంఘిస్తున్నారని, అక్రమాస్తుల వ్యవహారంలో ఆయనకిచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో.. జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. అందులో.. పిటిషనర్ తన ప్రశ్నార్థకమైన పూర్వాపరాలను వెల్లడించలేదన్నారు. రూ.947.71 కోట్ల బ్యాంకు సొమ్మును పక్కదారి పట్టించిన వ్యవహారంలో రఘురామతోపాటు కంపెనీలపై కేసు నమోదైందన్నారు.
237.84 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసి, పక్కదారి పట్టించిన మరో కేసులోనూ నిందితుడిగా ఉన్నారన్నారు. ఇవి కాకుండా 7 క్రిమినల్ కేసులున్నాయని చెప్పారు. రఘురామ దుష్ప్రవర్తన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులైలోనే స్పీకర్‌కు.. జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైకాపా లేఖ ఇచ్చిందన్నారు. రాజకీయ లక్ష్యాల కోసం న్యాయ ప్రక్రియను రఘురామ వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
సాధారణంగా దర్యాప్తు సంస్థ విధులు నిర్వర్తించలేదని భావించినప్పుడు బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చని, అంతేగానీ మూడో వ్యక్తికి అవకాశం లేదని తెలిపారు. బెయిలు రద్దుకు దరఖాస్తు చేయలేదనడం మినహా దర్యాప్తునకు సంబంధించి సీబీఐ వైఫల్యంపై పిటిషనర్ ఎలాంటి ఆరోపణ చేయలేదన్నారు. కోర్టు రికార్డులను పరిశీలిస్తే సత్వర విచారణకు తాము సహకరించలేదన్నది వాస్తవం కాదని తెలుస్తుందన్నారు. జగన్ సీఎంగా ఉన్న ఏపీ ప్రభుత్వం పరిధిలో సీబీఐ లేదని, కేంద్రం పరిధిలో ఉందని గుర్తుచేశారు. హైకోర్టు ఉత్తర్వులతో సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టిందని, సీబీఐ దర్యాప్తునకు వ్యతిరేకంగా ఏమీ చెప్పకుండా రాజకీయ కారణాలతో దాఖలు చేసిన రఘురామ పిటిషన్ విచారణార్హం కాదన్నారు.
ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రచారం కల్పించుకోడానికి... రఘురామ పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా న్యాయ ప్రక్రియను కలుషితం చేశారని ఆరోపించారు. జగన్ సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారనడానికిగానీ, సాక్షులను బెదిరిస్తున్నారనడానికిగానీ ఒక్క ఆధారం చూపలేదన్నారు. విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, కోనేరు ప్రసాద్, ధర్మాన ప్రసాదరావులు స్వతంత్రులని, జగన్ అధికార పరిధిలో లేరని అన్నారు. ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్‌లను ప్రతివాదులుగా చేర్చకుండానే వారిపై రఘురామ తీవ్రమైన ఆరోపణలు చేశారన్నారు. సీఆర్‌పీసీ 439(2)కు విరుద్ధంగా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తక్షణం కొట్టివేయాలన్నారు.
ఏకవాక్యంతో సీబీఐ మెమో
బెయిలు రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేయాలని సీబీఐ కోర్టు (CBI COURT) ఆదేశించగా, మంగళవారం సీబీఐ మెమో దాఖలు (CBI MEMO) చేసింది. నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలిపెడుతున్నామని, చట్టప్రకారం ఉన్న అంశాలను పరిశీలించి నిర్ణయం వెలువరించాలంటూ ఏకవాక్యంతో మెమో దాఖలు చేసింది. మరోవైపు జగన్ కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి గడువు కావాలని రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేశ్ కోరడంతో విచారణను ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది.
నా ఎఫ్‌ఐఆర్‌ల ప్రస్తావన హాస్యాస్పదం: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
తాను ఏ కేసులోనూ దోషిని కాదని, కనీసం ఛార్జ్‌షీటు కూడా లేనందున... బెయిల్ రద్దు పిటిషన్ వేసే హక్కు తనకు ఉందని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. పలు ఎఫ్‌ఐఆర్‌లలో పేరున్న వ్యక్తి... వేరొకరి బెయిలు రద్దుకు పిటిషన్ దాఖలు చేయడమేంటని ముఖ్యమంత్రి జగన్ తన కౌంటర్‌లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దిల్లీ నుంచి మంగళవారం ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఎన్నో కేసుల్లో ఏ1గా ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ఆయన మంగళవారం సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో... తనపై ఉన్న రెండు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లు, తన నియోజకవర్గంలో ఒకేరోజు ఒకే సమయంలో పెట్టిన ఏడు ఎఫ్‌ఐఆర్‌లను ప్రస్తావించారని తెలిపారు. జగన్ కౌంటర్‌కు వారం రోజుల్లో సమాధానం సమర్పిస్తామని తెలిపారు.
ఇవీచూడండి: Hc on Covid: నివేదికపై అసంతృప్తి... ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం