విద్యారంగంపై 'మన పాలన-మీ సూచన' పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేధోమథన సదస్సు నిర్వహించారు. ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే వారి సంఖ్య పెంచాలని సూచించారు. పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్న సీఎం...పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పిల్లలను చదివించాలని తల్లిదండ్రులకు ఆరాటం ఉన్నా సహకారం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని..ఆ పరిస్థితిని అధిగమించేలా చర్యలు ఉండాలన్నారు. పిల్లలకు చదువు లేకపోతే పేదవాళ్లు లాగానే మిగిలిపోతారని...వాళ్లు అలా కాకుండా ఉండాలంటే ప్రాథమిక స్థాయి నుంచే మార్పు తీసుకురావాలని తెలిపారు.
ఆగస్టు 3నే జగనన్న విద్యా కానుక...
రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.... సరైన సౌకర్యాలు ఉండట్లేదని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలని తొలి అడుగు వేశామని తెలిపారు. ప్రతి పేరెంట్ కమిటీని అడిగితే 94 శాతం మంది ఆంగ్ల మాధ్యమం మంచి ఆలోచన అన్నారని..ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆపేందుకు కుట్ర పన్నారని సీఎం జగన్ విమర్శించారు.
ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని జగన్ ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా అని సీఎం ప్రశ్నించారు. పెద్ద పెద్దవాళ్లంతా తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆగస్టు 3న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని..అదే రోజున జగనన్న విద్యా కానుక అందిస్తామని సీఎం తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'