సాగు నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో ముఖ్య ఇంజినీర్ల స్థానాలు(సీఈ) పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సీఈలను నియమించి మేజర్, మీడియం, మైనర్ విభాగాలను వారి పరిధిలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది.
ఈ క్రమంలో పలు ప్రాజెక్టులు, పరీవాహకాల పరిధిలో సర్కిళ్లు, డివిజన్ల కూర్పు కష్టంగా మారడంతో ప్రాజెక్టుల సంఖ్య, ఆయకట్టు తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని సీఈలను క్షేత్రస్థాయిలో నియమించాలని భావిస్తున్నారు.
ప్రధానంగా ఎత్తిపోతల పథకాలు అధికంగా ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ముగ్గురు సీఈలను నియమించనున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రాజెక్టులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కలిపి ఇద్దరు సీఈలున్నారు.
మార్పుల్లో భాగంగా జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు కలిపి ఒకరు.. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు వేర్వేరుగా సీఈలను నియమించనున్నారు. కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల హెడ్ రెగ్యులేటర్లు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఉంటుండగా ఉదండాపూర్, కోయిల్‌సాగర్ ప్రాంతాలు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి రానున్నాయి.
నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పేరుతో ప్రస్తుతం సీఈ ఉండగా ఈ స్థానంలో నల్గొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కలిపి ఒకరు.. శ్రీశైలం పరీవాహకంలోని డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు కలిపి శ్రీశైలం సీఈని నియమించనున్నారు.
శ్రీరామసాగర్‌కు ఒక సీఈ ఉండగా ఆయకట్టు పరిధిని బట్టి ఇద్దరిని నియమించే అవకాశాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఇద్దరు సీఈలు ఉండగా ముగ్గురు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒకరుండగా ఎన్‌ఎస్‌పీ పరిధి కలిపి ఇద్దరిని నియమించే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్