NTR 100th Anniversary: తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన చంద్రబాబు నివాళులు అర్పించారు. అంతకుముందు ఆయన భారీ వాహన ర్యాలీతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశారు.
‘‘తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. పేదవారికి ఏం కావాలో తెలుసుకుని అందించిన మహా వ్యక్తి. మహానాడులో భాగంగా సాయంత్రం బహిరంగ సభలో జిల్లా సమస్యలు ప్రస్తావిస్తా. ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే దామచర్ల జనార్దన్ కృషే. మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని బస్సులకు అనుమతి ఇవ్వలేదు. తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలి. బహిరంగ సభకు రాకుండా అడ్డుకునేవాళ్లకు ఒక్కటే చెబుతున్నా. సాయంత్రం బహిరంగ సభకు ఎంతమంది వస్తారో చూడండి’’ -చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత
వైకాపాపై ధ్వజం.. జనాలు రావాలనుకుంటున్న మహానాడుకు బస్సుల్ని ఇవ్వకుండా.. ప్రభుత్వం ఎవరూ లేని యాత్రకు బస్సుల్ని తిప్పుతోందని.. చంద్రబాబు ఎద్దేవా చేశారు. మహానాడుకు ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు.. బస్సులకు అనుమతి ఇవ్వలేదన్నారు. తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం: తెరాస నేతలు