ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల్లో చేసే ఆరాచకాలతో వైకాపా తీసుకున్న గోతిలో వారే పడటం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మొదటి రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికలతో వైకాపా పతనం ఖాయమన్నారు. శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పుగోదావరి అనంతపురం జిల్లాలలో దౌర్జన్యకాండ రాష్ట్రమంతా చూసిందని తెలిపారు. హింస విధ్వంసాలతో ప్రజలు విసిగిపోయారని స్పష్టం చేసారు. వైకాపాకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు.
ఏకగ్రీవాలపై వైకాపా ఆశలు నీరుగారాయన్న చంద్రబాబు... బెదిరించి, ప్రలోభపెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాలన్న కుట్రలు నెరవేరలేదని ఎద్దేవా చేశారు. తప్పుడు పనులతో ప్రజల్లో భయోత్పాతం సృష్టించారని విమర్శించారు. ఎలాంటి పరిస్థితులునైనా ఎదుర్కోటానికి సిద్దంగా ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఓటమి భయంతోనే వైకాపా ప్రభుత్వం ఆన్లైన్ నామినేషన్లకు అనుమతించలేదని మండిపడ్డారు. తర్వాత దశల్లోనైనా ఆన్లైన్ నామినేషన్లకు అనుమతి కోరామన్నారు.
ఇదీ చదవండి: 'మేం స్పందిస్తే.. మీ పార్టీకి అతీగతీ ఉండదు'