ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. 30రోజులకు పైగా తాడికొండలో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రసంగించిన ఆయన... 2015లో అమరావతిని ఏపీ ్ర రాజధానిగా నోటిఫై చేశామని గుర్తు చేశారు. దేశ చిత్రపటంలో రాజధానిగా గుర్తించేలా పోరాడామని తెలిపారు. రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రం ఏమైనా మీ జాగిరా..?
ఏపీ రాజధాని తరలింపుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిని ఎలా మారుస్తారో చూస్తామని వ్యాఖ్యానించారు. 30 రాజధానులు పెడతామంటూ మాట్లాడుతున్నారని... రాష్ట్రం ఏమైనా వైకాపా జాగీరా అని ప్రశ్నించారు. ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.
13 మంది సీఎంలు పెట్టుకోండి..
జగన్ పాలనను పిచ్చి తుగ్లక్ పాలనగా అభివర్ణించిన చంద్రబాబు... 13 జిలాల్లో రాజధానులు ఏర్పాటు చేసుకుని... 13 మంది సీఎంలను పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. బాబాయ్ హత్య కేసులో నిందితులెవరో చెప్పలేని అసమర్థ వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరమన్నారు. నవరత్నాలతో ప్రజలను మోసం చేసిన వైకాపా ప్రభుత్వం... తాజాగా ఏడు లక్షల పింఛన్లను తొలగించిందని ఆరోపించారు.
పోలీసులది అత్యుత్సాహం
ఉద్యమకారులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలపటం రాజ్యాంగం ఇచ్చిన హక్కని అన్నారు. వీటన్నింటిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. సీమకు నీళ్లిచ్చిన చరిత్ర తెదేపాదే అన్న ఆయన... పులివెందుల ప్రాంతానికి కూడా తామే నీళ్లిచ్చామని పేర్కొన్నారు. రాజధాని పోరాటంలో ఏ త్యాగానికైనా సిద్ధమేనని ప్రకటించారు. జగన్ వ్యవహరిస్తున్న తీరు వల్ల సాధారణ ప్రజలు రోడ్లపైకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందన్న విషయం జగన్‌తోనే చెప్పిస్తామని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలు ఆడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా అనుమానితులు