పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పని తీరు మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 59 మంది ఇంఛార్జ్‌లతో చంద్రబాబు ముఖాముఖి భేటీ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అంటూ ఇంఛార్జ్‌లను.. చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంఛార్జీలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. నాయకుల పనితీరుపై సమగ్ర సమాచారంతో వివిధ అంశాలపై లోతుగా సమీక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అంతర్గత నివేదికల ఆధారంగా నేతల పనితీరును విశ్లేషించి.. బాగా పనిచేస్తున్న వారిని అభినందించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, బాదుడే బాదుడు వరకూ.. అన్ని అంశాలపై సమీక్షించారు. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై ఉందన్న ఆయన.. అలా అని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని ఘాటుగా హెచ్చరించారు. సమీక్షలను నేతలు సీరియస్‌గా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని తేల్చిచెప్పారు. అంతిమంగా పనితీరే ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..:
ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
డ్రగ్ మాఫియా డాన్ స్టీఫెన్ అరెస్ట్.. 40 ఏళ్ల మత్తు దందాకు పోలీసుల చెక్..
కశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర.. 73ఏళ్ల వ్యక్తి ప్రయాణం.. వెయ్యి కి.మీ పూర్తి