రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ.. ఏపీ సీఎం జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నాని తెలిపారు. మద్దతు ధరకు కొనుగోలులోనూ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహించారు. రైతులను నిండా ముంచే విధానాలు అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వంలో 48 గంటల్లోనే నగదు జమ చేశామని.. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు చేసి 2 నెలలు దాటినా అతీగతీ లేదని విమర్శించారు. అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? ఖరీఫ్‌కు పెట్టుబడులు ఎవరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని.. రాయలసీమలో వేరుశనగ పంట నష్టపోయినా పెట్టుబడి రాయితీ అందలేదన్నారు. ధాన్యం కొనుగోలుకు ఆర్బీకేల పేరుతో హడావుడి చేస్తున్నారని తెలిపారు. కౌలు రైతులుకు ప్రభుత్వ సాయం అందడం లేదన్న చంద్రబాబు.. ఈ-క్రాప్‌లో నమోదు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
మిల్లర్లు, వైకాపా నాయకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని లేఖలో ఆయన కోరారు. పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన పంటలకు తక్షణమే చెల్లింపులు జరపాలని చంద్రబాబు తెలిపారు.