ఏపీని పాలించే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు(tdp chief chandrababu) విమర్శించారు. కుప్పం పర్యటనలో భాగంగా.. నిర్వహించిన బహిరంగ సభలో బాబు మాట్లాడారు. ‘‘విశాఖ ఏజెన్సీలో 25వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారు. రూ.8వేల కోట్ల విలువైన గంజాయి సరఫరా చేస్తున్నారు. చర్యలు తీసుకోమని కోరితే తెదేపా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. దిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఏపీలోని పరిస్థితులు వివరించాం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉగ్రవాదం ఉందని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం. తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న తెదేపా కార్యాలయంపై దాడులు చేయిస్తున్నారు. నాపై బాంబులు వేస్తామని అంటున్నారు. బాంబులకు భయపడే వ్యక్తిని కాదు. అక్రమ కేసులకు భయపడి పార్టీ మూసేయాలా? పేదల కోసం ధర్మపోరాటం చేస్తున్న నన్ను ప్రజలే కాపాడుకుంటారు. ఏపీలో వింత వింత మద్యం బ్రాండ్లు తెచ్చారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు. కరోనా సమయంలో కూడా మద్యం షాపులు తెరిచారు. జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తరకం మద్యం బ్రాండ్లు తెచ్చి.. రేట్లు విపరీతంగా పెంచేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.
గంజాయిపై తెదేపా కార్యకర్తలు పోరాడుతున్నారు. మన ఇంట్లోనే గంజాయి పెట్టి తప్పుడు కేసులు పెడతారు. రౌడీయిజం కావాలా?.. శాంతి, అభివృద్ధి కావాలా? చెత్త, ఇంటి, నీటి పన్నులు పెంచి ఓటు అడిగే హక్కు ఉందా? గ్రానైట్ క్వారీలు ఇష్టారీతిన వశపరుచుకున్నారు. వాస్తవాలు అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించండి.
- చంద్రబాబు, తెలుగుదేశం అధినేత.
చంద్రబాబు సభలో అలజడి..
కుప్పం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బహిరంగసభ వద్దకు చేరుకుని కలకలం రేపాడు. బాంబు తెచ్చాడంటూ అనుమానం వ్యక్తం చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని తెదేపా నాయకులు చుట్టుముట్టారు. ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. సభలోకి చొరబడిన వ్యక్తి వైకాపా కార్యకర్తగా గుర్తించిన తెదేపా వర్గీయులు.. సభను అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు పన్నిందని మండిపడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సభలో రేగిన అలజడితో ఆందోళన చెందిన చంద్రబాబు భద్రతా సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సభలో అలజడి రేపిన వ్యక్తి ఏపీ టూరిజం పున్నమి హోటల్ అసిస్టెంట్ మేనేజర్ మోహన్‌గా గుర్తించారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తెరిచి ఆయనకు రక్షణగా నిలిచారు. వైకాపా గూండాయిజం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు. సభలోకి వచ్చిన వ్యక్తి ఎవరని ప్రశ్నించిన చంద్రబాబు.. కార్యకర్తలు ఆగ్రహానికి లోనుకావద్దని సూచించారు. మోహన్‌ను విచారించిన అనంతరం పోలీసులు అతడిని వదిలేశారు.
"తెదేపా మరోసారి అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రాగానే కమిషన్ వేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షించే వరకు వదిలిపెట్టను. న్యాయానికి తల ఒగ్గుతాం.. దుర్మార్గానికి గుండె చూపుతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని అణచివేశా. తెదేపా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా క్షోభపెట్టారు. పోలీసులను ఉసిగొల్పుతూ తప్పుడు కేసులు పెడుతున్నారు. తీవ్రవాదులు, ముఠా నాయకులకు భయపడలేదు. డబ్బు సంచులతో కుప్పం వస్తున్నారు. కుప్పంలోకి రౌడీలు, గూండాలు ప్రవేశించారు’’.
- చంద్రబాబు, తెలుగుదేశం అధినేత.
ఇదీచూడండి: 'మంగళవారం మరదలమ్మా' వ్యాఖ్యలపై మంత్రి ఏమన్నారంటే...?