ఏపీలో భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం.. అదనపు పన్నులతో మరింత బాదేస్తోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అదే సమయంలో ఆయా రాష్ట్రాలనూ పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపునివ్వడం ప్రశంసనీయం అన్నారు. తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు.
'పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతుంది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. ప్రజలు భారం మోయలేక పోతున్నా.. ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదు. గతేడాది చివరిలో దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయి. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోగా.. అదనపు పన్నులతో మరింత బాదేస్తున్నారు. కేంద్రం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6లు పన్ను తగ్గించుకుంది. ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేశారు. వైకాపా ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలి' - చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత
ఇవీ చదవండి..: