ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వం.... రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఐదేళ్ల కాలంలో 8 లక్షల 50 వేల 173 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. మరో 6 లక్షల 15 వేల 638 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఎలక్షన్ కోడ్ ఇతరత్రా కారణాల వల్ల పూర్తైన ఇళ్లు లబ్ధిదారులకు అందలేదు. తెదేపాపై కక్షతోనే లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా నూతనంగా నిర్మించిన భవన సముదాయాల వద్ద ఇవాళ తెలుగుదేశం శ్రేణులు నిరసనలు చేపట్టనున్నాయి.
తెదేపా అధినేత చంద్రబాబు కూడా పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి నిరసన కార్యక్రమాలు.. చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తమ హయాంలో నిర్మించిన ఇళ్లను ఇంతవరకు పేదలకు అందించపోవడంపై బాబు మండిపడ్డారు. గ్రామాల్లో పేదలు కట్టుకున్న ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో వైకాపా వేధింపులకు నిరసనగానే ఇవాళ ఆందోళనలు చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఇళ్ల స్థలాల కుంభకోణంపై రేపు ఆందోళనలు
తాజాగా ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నతెదేపా... దీనిపై మంగళవారంనాడు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఇళ్ల స్థలాల కుంభకోణాలు జరిగిన ప్రాంతాలను సందర్శించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. వర్చువల్ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: కరోనా బాధితుడికి కాలం చెల్లిన మందులు... కలెక్టరుకు ఫిర్యాదు