తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఏపీలోని విజయవాడ నోవాటెల్ హోటల్‌కు వెళ్లి పవన్‌తో సమావేశమైన చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇరువురి భేటీకి విశాఖలో పోలీసులు పవన్ కల్యాణ్ పట్ల వ్యవహరించిన తీరే సందర్బమైనప్పటికీ.. మున్ముందు ఈ బంధం ఏ దిశగా పయనిస్తుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఇరువురు నేతలు బహిరంగంగా కలవడం ఇదే ప్రథమం.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇలాగే హైదరాబాద్‌లో పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ఆయనతో భేటీ అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఆ ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ.. తెలుగుదేశానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబుతో భేటీకి ముందు పవన్ కల్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. ఇవాళ్టి నుంచి రాజకీయ ముఖచిత్రం మారుతోందని.. భాజపాతో పొత్తు ఉన్నా ఎందుకో కలిసి వెళ్లలేకపోతున్నామని పవన్ అన్నారు. ప్రధాని, భాజపా నాయకత్వం అంటే తనకు గౌరవముందన్న పవన్.. ఈ విషయం భాజపా రాష్ట్ర నాయకత్వానికి తెలుసునని వ్యాఖ్యానించారు. గౌరవం ఉన్నంత మాత్రాన తాము ఊడిగం చేయలేమన్నారు. భాజపా నేతలను రోడ్‌మ్యాప్ అడిగినా ఇవ్వలేదని.. ఈలోపు రౌడీలు రాజ్యమేలుతుంటే తన ప్రజలను రక్షించుకోవడానికి తాను వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుందని పవన్ తెలిపారు.
ఇవీ చూడండి..
ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే.. వైకాపాపై పవన్ ఘాటు వ్యాఖ్యలు
వారిని వదిలేయడంతో భాజపా స్థాయి మరింత దిగజారినట్లైంది: కేటీఆర్