గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కోర్టులు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తేదారులపై కక్ష సాధింపులేమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడంలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రంజిత్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషిచేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని. వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం హేయనీయమని విమర్శించారు. చేసిన పనులకు ఏపీ ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సుమారు రూ.80 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని దుయ్యబట్టారు. గుత్తేదారులెవరూ ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. వారికి ప్రతిపైసా అందే వరకు బాధితుల తరపున తెదేపా పోరాటం చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: Ram Gopal Varma: హనుమకొండలో రామ్‌గోపాల్ వర్మ 'కొండా' షూటింగ్