Telangana Liberation Day: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా ఏడాదిపాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను.. నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంతోపాటుగా.. ఏడాదిపాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హనుమకొండకు వెళ్లిన కిషన్‌రెడ్డి ఈటల రాజేందర్‌ను పరామర్శించారు.
'విమోచన దినోత్సవం నిర్వహించకుండా అమరులను కేసీఆర్ అవమానిస్తున్నారు. ఈనెల 17న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన వేడుకలు. కేంద్ర బలగాలతో పరేడ్ గ్రౌండ్‌లో విమోచన వేడుకలు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా విమోచన వేడుకలు. హైదరాబాద్‌లో విమోచన వేడుకలకు అమిత్‌షా హాజరవుతారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగానే విమోచన వేడుకలు. ఎంఐఎం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి భయం. మజ్లిస్‌కు భయపడి విమోచన వేడుకలు జరపట్లేదు.'- కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
అమరవీరులను కేసీఆర్ అవమానిస్తున్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించకుండా అమరవీరులను... కేసీఆర్ ఘోరంగా అవమానిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న అధికారికంగా చేస్తామని హామీ ఇచ్చిన సీఎం... వెనక్కి తగ్గడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ విషయం వెనుక అసలు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జిమ్మిక్కు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాదైతే గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: