Kishan Reddy Comments: కొవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని... ఆ ప్రభావం భారత్‌పైనే కాదు అమెరికాపై కూడా పడిందన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలపై పెరుగుతున్న పెట్రోభారం తగ్గించేందుకు కేంద్రం ఛార్జీలు తగ్గించిందని... కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెస్ తగ్గించలేదన్నారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వసూలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్ తగ్గించారని ప్రచారం చేసుకుంటున్నారని... కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదన్నారు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆదుకోవాల్సింది పోయి.. ఎక్కడో పంజాబ్‌లో చనిపోయిన రైతు కుటుంబాలను కలుస్తున్నాడని మండిపడ్డారు.
Kishan Reddy on KCR: కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం నిరుపేదల కోసమేనని... కేసీఆర్‌కు దీనిపై కనీస అవగాహన లేదన్నారు కిషన్ రెడ్డి. మొదటి సారి ఎన్నికలప్పుడు చేసిన కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య... హామీ ఏమైందని ప్రశ్నించారు. మాకు కేసీఆర్ సర్టిఫికేట్ అక్కర్లేదని గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తాం అన్నారని... కానీ అవన్నీ ప్రగతి భవన్‌కే పరిమితం అవుతాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
'రానున్న రోజుల్లో కల్వకుంట్ల ప్రభుత్వానికి చీదరింపు తప్పదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మోదీ మీద ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు. ఇక్కడ నమ్మడం లేదని దిల్లీ, పంజాబ్ పోయి అక్కడ రైతులకు సహాయం చేస్తానంటూ... ఇక్కడ తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దిక్కులేదు కానీ... తగుదునమ్మా అంటూ అక్కడ పర్యటిస్తున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడిని కలిసినా... పాక్ ప్రధానిని కలిసినా మేం భయపడం.'-కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి: