భారీగా కురిసిన వర్షాలతో నగర ప్రజలు తీవ్రంగా నష్ట పోయారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరద ప్రభావాన్ని పరిశీలించేందుకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించినట్టు తెలిపారు. చాలామంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా నిర్లక్ష్య విధానాలే వరదలకు కారణమని ఆరోపించారు. సాంకేతికతను ఉపయోగించడంలో జీహెచ్ఎంసీ విఫలమైందన్నారు. వర్షపు నీటితో పైపులు పూర్తిగా మూసుకుపోయాయని... తక్షణమే పునరుద్ధరించి, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.
వేలాది అపార్ట్మెంట్స్ సెల్లార్లలో నీళ్లు నిలిచిపోయాయని కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడి... కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు వివరించారు. బాధితులకు ఆహారం, మంచి నీళ్ళు, షెల్టర్ ఇవ్వాలని పార్టీ శ్రేణులను నడ్డా ఆదేశించినట్టు తలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, యువత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిస్తే కేంద్రం సహాయం చేస్తుందన్నారు.
ఇదీ చూడండి: సమగ్ర కార్యాచరణతోనే వరదలకు చెక్: కిషన్ రెడ్డి