వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు అధికారుల బృందాన్ని పంపే ఆలోచనలో కేంద్రం ఉంది. తెలంగాణ, ఏపీలో అకాల వర్షాలు, తుపాను ప్రభావంతో తీవ్రస్థాయిలో వరదలు రావడంతో నష్టం వాటిల్లినందున ఆదుకోవాలని కేంద్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగిందని నివేదించాయి. వర్షాల వల్ల జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొన్నాయి. వెంటనే వీటన్నింటిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టాలని రెండు రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి.
రాష్ట్ర విపత్తు నిధి నుంచి అవకాశం ఉన్నంత మేరకు నిధులు వాడుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సహకారం కోసం ప్రత్యేకంగా కేంద్ర హోం శాఖ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హోం శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు తగిన సూచనలు ఇస్తున్నారు.
వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, రోడ్లు ఇతర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని ఇవాళ లేదా రేపు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కేంద్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉండనున్నారు. ఈ బృందాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రాష్ట్ర అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల నుంచి సమాచారం సేకరించి కేంద్రానికి నివేదించనున్నాయి.
ఇదీ చదవండి: హైదరాబాద్లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్