ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో సాగాలన్నదే తమ విధానమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు.. వీలైనంత వరకూ ఉన్నతస్థాయిలోనూ మాతృభాషలోనే బోధించాలని 1968 నాటి విద్యావిధానంలో ఉందని చెప్పింది. 2020 జులై 29న కేంద్రం ఆమోదించిన నూతన విద్యావిధానం కూడా ఇదే చెబుతోందని వివరించింది. ప్రాథమిక విద్యలో ఆంగ్ల బోధనను తప్పనిసరి చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో కేంద్ర పాఠశాల విద్యాశాఖ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
2003 నాటి నివేదికను అఫిడవిట్‌కు జతచేసి
విద్యా నాణ్యత పెంపు కోసం యునెస్కో కూడా మాతృభాషా బోధననే సమర్థిస్తున్నట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన 2003 నాటి నివేదికను అఫిడవిట్‌కు జతచేసింది. 'ప్రాథమిక విద్యాబోధన తప్పనిసరిగా పిల్లల మాతృభాషలోనే సాగాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 350ఎ ప్రకారం భాషాపరంగా మైనార్టీ వర్గాల పిల్లలకు సైతం ప్రాథమిక విద్యను వారి మాతృభాషలోనే బోధించాలి. అందుకు అనువైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, స్థానికసంస్థల మీదా ఉంటుంది. మాతృభాషలో బోధించడమే అత్యుత్తమమని 2005 నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ చెబుతోంది. ఆ కరిక్యులమ్‌ను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. దాని ప్రకారం త్రిభాషా సూత్రం అమలుకూ ప్రభుత్వాలు కృషి చేయాలి' అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
మాతృభాషలోనే ఉండాలని
2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29 (ఎఫ్).. సాధ్యమైనంత మేరకు విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నట్లు కేంద్రం గుర్తుచేసింది. పిల్లలు భయపడకుండా స్వేచ్ఛగా భావాలను వ్యక్తం చేసే వాతావరణం పాఠశాలల్లో ఉండాలని పేర్కొంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే పిల్లల మాతృభాషే బోధనా భాషగా ఉండాలని నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌లో పేర్కొన్నట్లు వెల్లడించింది. భాషాభివృద్ధి గురించి 1968 నాటి విద్యా విధానంలోనూ వివరంగా ఉన్నట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ మాతృభాషలో బోధన ఉండాలని అందులో పేర్కొన్నట్లు గుర్తుచేసింది. ‘‘విద్య, సాంస్కృతికాభివృద్ధికి భారతీయ భాషలు, సాహిత్యం శక్తిమంతం కావాలి. స్థానిక భాషలు అభివృద్ధి చెందేవరకూ విద్యాప్రమాణాలు మెరుగుపడవు. విజ్ఞానం ప్రజల చెంతకు చేరదు. ఇప్పటికే ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో మాతృభాషల్లో విద్యాబోధన జరుగుతోంది. ఇప్పుడు యూనివర్సిటీల స్థాయిల్లోనూ మాతృభాషలో బోధించాలి’’ అని 1968 నాటి విద్యావిధానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ తన అఫిడవిట్‌లో తెలిపింది. ఆ భాషా విధానాన్నే 1986, 1992 విద్యా విధానాలు కూడా సమర్థించినట్లు వెల్లడించింది.
నూతన విద్యావిధానం కూడా..
2020 జులై 29న కేంద్రం ఆమోదించిన నూతన విద్యావిధానం కూడా ఇదే చెబుతున్నట్లు వివరించింది. ‘‘పిల్లలు తమ మాతృభాషల్లో అయితేనే క్లిష్టమైన అంశాలను సులభంగా నేర్చుకోగలరు. కనీసం ఐదో తరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన ఉండాలి. దీన్ని 8వ తరగతి, అంతకుమించి కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత కూడా సాధ్యమైనంతమేర మాతృభాషలో విద్యాబోధన కొనసాగించాలి. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలుచేయాలి. సైన్స్ సహా అత్యంత నాణ్యమైన పాఠ్యపుస్తకాలను మాతృభాషలో అందుబాటులోకి తేవాలి. పిల్లలు మాట్లాడే భాషకు, బోధనా భాషకు ఎక్కడైనా తేడా ఉంటే ప్రాథమిక స్థాయిలోనే దాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని నూతన విద్యావిధానం పేర్కొన్నట్లు కేంద్రం తన అఫిడవిట్‌లో వివరించింది.
ఇదీ చదవండి: మధ్యాహ్నం బిహార్ ఎన్నికల షెడ్యూల్!