పంటల కొనుగోలుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌లను రాష్ట్రంలో అమలుచేస్తే వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థ మనుగడ సాగించలేదని మార్కెటింగ్ శాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై మార్కెటింగ్ శాఖ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్గత నివేదికను అందజేసింది.
ముఖ్యాంశాలు...
- రాష్ట్రంలో ప్రస్తుతం 184 మార్కెట్లు, 7 ఉప మార్కెట్లున్నాయి. వీటిలో 64 ప్రధాన మార్కెట్లు, మిగిలిన 7 ఉప మార్కెట్ యార్డులకు రైతులు పంటలను ఎక్కువగా తెస్తున్నారు. మిగిలిన 120 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో ఎక్కడ పంటలను కొన్నా వాటిని తరలించేటప్పుడు చెక్‌పోస్టుల్లో మార్కెట్ రుసుము చెల్లిస్తున్నారు.
- ఆర్డినెన్స్‌ల అమలుతో రాష్ట్రవ్యాప్తంగా గల 300 వ్యవసాయ చెక్‌పోస్టులను రద్దు చేయాలి. వాటిద్వారా తరలించే పంటలపై ఏటా వసూలవుతున్న రుసుము రూ.225 కోట్లు రాకుండా పోతుంది.
- 2017-20 మధ్య అన్నివ్యవసాయ మార్కెట్లలో ఏటా రూ.346 కోట్ల చొప్పున మార్కెట్ రుసుము వసూలైంది. ఇందులో రూ.121 కోట్లు మాత్రమే వ్యవసాయ మార్కెట్లలో అమ్మిన పంటలపై వచ్చింది. మిగిలిన రూ.225 కోట్లు మార్కెట్ల బయట కొన్నపంటలపై, చెక్‌పోస్టుల్లో వసూలు చేసిందే.
- ఆర్డినెన్సు అమలైతే లైసెన్సులున్న వ్యాపారులు మార్కెట్లకొచ్చి పంటలు కొనరు. దీంతో గతేడాది మార్కెట్లలో జరిగిన కొనుగోళ్లపై వచ్చిన రూ.121 కోట్ల రుసుము ఇక రాదు.
- ప్రస్తుతం 6166 మంది వ్యాపారులు, 2099 మంది రైస్ మిల్లర్లు, 314 జిన్నింగ్ మిల్లులు, 106 శీతల గిడ్డంగులు, 4613 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. వీరు లైసెన్సులు రద్దు చేసుకుంటే లైసెన్సు రుసుముకు గండి పడుతుంది.
- రాష్ట్రంలో 57 చోట్ల ‘ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్’ (ఈ-నామ్) కింద ఆన్‌లైన్‌లో పంటల కొనుగోలు జరుగుతోంది. 5638 మంది వ్యాపారులు ఆన్‌లైన్‌లో కొనుగోలుకు లైసెన్సులు తీసుకున్నారు. ఎక్కడైనా పంటలు కొనడం మొదలైతే ఎంతకు కొంటున్నారనే సగటు ధర తెలుసుకోవడం కష్టమవుతుంది.
- వ్యవసాయ మార్కెట్లలో పనిచేసే 2,449 మంది ఉద్యోగులు, 1508 మంది పింఛనుదారులకు జీతభత్యాలు, పింఛన్లు, మార్కెట్లు, రైతుబజార్ల నిర్వహణ ఖర్చులు గతేడాది(2019-20)లో రూ.246 కోట్లు అయ్యాయి.
- గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరినాటి(మార్చి 31)కి మార్కెట్ నిధి కింద ఖజానాలో రూ.540 కోట్లు ఉన్నాయి. ఇప్పటికే చేపట్టిన పనులకు రూ.227.98 కోట్లు ఇందులో చెల్లించాలి. ఈ ఏడాది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులకు మరో రూ.250 కోట్లు కావాలి. ఈ ఏడాది ఆర్డినెన్స్‌లు అమల్లోకి వస్తే ఇక ఆదాయం అదనంగా ఏమీ రాదు.
- ఆర్డినెన్స్‌లు అమలు చేస్తే మార్కెట్లు ఉండాలంటే ఏటా ఖర్చులకే బడ్జెట్‌లో రూ.300 కోట్లను ప్రభుత్వం కేటాయించాలి.
ఇవీ చూడండి: కేబినెట్ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ