Boiled Rice Issue : ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక జవాబిచ్చారు. అవసరాల రీత్యా రాష్ట్రాలే బాయిల్డ్ రైస్ సేకరించుకోవాలని సూచించారు. ఇకపై బాయిల్డ్ రైస్ సేకరించబోమని గత ఖరీఫ్‌లోనే చెప్పామన్న కేంద్రమంత్రి.. 2020-21 ఖరీఫ్‌లో 47.49 లక్షల మెట్రిక్‌టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించామని వివరణ ఇచ్చారు. 6.33 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యాన్ని సేకరించామని తెలిపారు.
Boiled Rice Issue in Telangana : ఉప్పుడు బియ్యం సేకరించబోమని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ రాతపూర్వకంగా వెల్లడించడంతో ధాన్యం సేకరణపై మరోసారి అయోమయం నెలకొననుంది. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం, రాష్ట్రం మధ్య విమర్శలు ప్రతివిమర్శలు సాగుతున్నాయి. ఇటీవలే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఒప్పందం మేరకు రాష్ట్రంలో రా రైస్ సేకరిస్తామని చెప్పారు. తాజాగా మరో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ లిఖితపూర్వక హామీతో కేంద్రం మరోసారి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.