Hyderabad-Bangalore Road Expansion : హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అలైన్‌మెంట్ ఖరారు కోసం కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు సూచించింది. ఆ మేరకు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భౌగోళిక సర్వే చేపట్టారు.
తెలంగాణ నుంచి కర్ణాటకకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారి నాలుగు వరుసలుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రహదారికి రెండు వైపులా ఒక్కో వరుస చొప్పున పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 576 కిలోమీటర్ల మార్గాన్ని రెండు భాగాలుగా విస్తరించనున్నారు.
తెలంగాణ పరిధిలో ఈ రహదారి హైదరాబాద్ నుంచి అలంపూర్ చౌరస్తా (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) వరకు 210 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి అలంపూర్ చౌరస్తా వరకు తెలంగాణ అధికారులు, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఏపీ అధికారులు విస్తరణ పనులు చేపడతారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం వేర్వేరుగా నిధులను మంజూరు చేస్తుంది. పనులు మాత్రం ఒకే దఫా చేపడతారు.
Hyderabad-Bangalore Road Expansion News : రహదారి విస్తరణకు అవసరమైన భూమిని గతంలోనే సేకరించారు. ప్రస్తుతం భూమి అందుబాటులో ఉండటంతో నెలన్నర రోజుల్లో డీపీఆర్‌ను సిద్దం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యవసర విభాగాల వివరాలు, ట్రాఫిక్ సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని రియల్ టైమ్ విధానంలో వాహనదారులకు అందించాలన్నది కేంద్రం వ్యూహం. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏపీ సరిహద్దు వరకు రహదారిని విస్తరించడానికి రూ.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందన్నది ప్రాథమిక అంచనా.
Hyderabad-Bangalore Road Expansion Updates : టెండర్లను ఆహ్వానించేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. అయితే, తెలంగాణ పరిధిలోని 210 కిలోమీటర్ల మార్గాన్ని ఎన్ని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలన్న అంశాన్ని ఖరారు చేయాల్సి ఉంది. వచ్చే జూన్ రెండో వారంలోపు కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించిన తరవాతి నుంచి రెండు, మూడు నెలల్లో విస్తరణ పనులు చేపట్టేందుకు కసరత్తు సాగుతోంది.
ఇవీ చదవండి :