CBI on Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు ఉమాశంకర్ రెడ్డికి బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సీబీఐ తెలిపింది. ఉమాశంకర్ రెడ్డి బెయిలు పిటిషన్ కొట్టేయాలని కడప కోర్టులో సీబీఐ కౌంటర్ పిటిషన్ వేసింది. వివేకాను హత్య చేయడానికి వెళ్లిన నలుగురులో గొడ్డలితో వెళ్లిన వ్యక్తి ఉమాశంకర్ రెడ్డి అని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా ఇంటి పెంపుడు కుక్కను కారుతో తొక్కించి చంపడంలోనూ అతనే కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. మరికొందరు వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిన నేపథ్యంలో ఉమాశంకర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సీబీఐ వాదించింది.
CBI on Uma Shankar Reddy Bail : ఇదే సమయంలో వివేకా హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్న డ్రైవర్ దస్తగిరి, వాచ్ మెన్ రంగన్నకు స్థానికంగా ఏదైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీబీఐ తెలిపింది. దస్తగిరి, రంగన్నకు పటిష్ట భద్రత కల్పించేలా పోలీస్ శాఖను ఆదేశించాలని కడప జిల్లా కోర్టుకు సీబీఐ విన్నవించింది. ఐతే.. ఇప్పటివరకు దస్తగిరి, రంగన్నకు ఏ మేరకు భద్రత కల్పించారో ఈనెల 14లోగా తెలపాలన్న కోర్టు.. విచారణను వాయిదా వేసింది.