ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో వాన్ పిక్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సెప్టెంబరు 22న విచారణకు హాజరుకావాలని ఏ-వన్‌గా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌కు ఈడీ కేసులను విచారణ జరుపుతున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. జగన్ సహా 21 మంది వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో ఈడీ చేర్చింది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాశ్, ఐఆర్టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్‌సింగ్‌కూ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. నిందితులందరూ సెప్టెంబరు 22న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
వాన్ పిక్ వ్యవహారంలో చేతులు మారిన సొమ్ముపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ సుదీర్ఘంగా జరిగింది. వివిధ కంపెనీల ద్వారా సొమ్ము చలామణి అయినట్లు ఈడీ గుర్తించింది. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, కార్మెల్ ఏషియా, సిలికాన్ బిల్డర్స్, వాన్ పిక్ ప్రాజెక్ట్స్, వాన్ పిక్ పోర్ట్స్, గిల్ క్రిస్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్, ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా అవెన్యూస్, బీటా అవెన్యూస్, జీ2 కార్పొరేట్ సర్వీసెస్, సుగుణి కన్స్ట్రక్షన్స్ కంపెనీలను కూడా నిందితుల జాబితాలో ఈడీ చేర్చింది. ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.
2016లోనే రూ.863 కోట్లు జప్తు..
జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన సుమారు రూ.863 కోట్ల ఆస్తులను 2016లోనే ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. జగన్ కంపెనీలకు చెందిన సుమారు రూ.538 కోట్ల విలువైన ఆస్తులతో పాటు.. వాన్ పిక్ భూములు సహా నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా సేకరణ..
వాన్ పిక్ ప్రాజెక్టుపై సీబీఐ అభియోగపత్రం ఆధారంగా ఈడీ సుదీర్ఘ విచారణ జరిపింది. వాన్ పిక్ ఓడ రేవు కోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 12 వేల 973 ఎకరాలు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించారు. వాన్ పిక్ ప్రాజెక్టు కోసం ప్రకాశం జిల్లాలో 3,401 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 2,003 ఎకరాల ప్రైవేట్ భూములను కూడా నిబంధనలకు విరుద్ధంగా సేకరించినట్లు అభియోగం ఉంది. విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, అప్పటి మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. ఆ సమయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన ఐఆర్టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శామ్యూల్, మౌలిక సదుపాయల శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ కూడా నిబంధనలను బేఖాతరు చేసినట్లు ఈడీ పేర్కొంది. అనేక ప్రయోజనాలు కల్పించినందుకు జగన్ సంస్థల్లోకి సుమారు రూ.854 కోట్లను నిమ్మగడ్డ ప్రసాద్ మళ్లించినట్లు సీబీఐ, ఈడీ అభియోగం.
ఇదీ చూడండి: KTR: 'సిరిసిల్ల జిల్లాలో ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందిస్తాం'