తెదేపా అధినేత చంద్రబాబుపై ఏపీలోని కర్నూలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఐపీసీ 188, 505(1)(బి)(2), 54 విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద శుక్రవారం కేసు నమోదైంది. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాసుపోగు సుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 6న పలు టీవీ ఛానళ్లలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు కేంద్రంగా ఎన్440కే అనే కొత్త వైరస్ వేరియంట్ పుట్టిందని, అది కరోనా కంటే 10 నుంచి 15 రెట్ల తీవ్రతతో వ్యాప్తి చెంది మానవ నష్టం కలిగిస్తుందని అన్నారని, ప్రజలు భయాందోళనకు గురయ్యేలా ఆయన వ్యాఖ్యలున్నాయని సుబ్యయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నగర ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు సిద్ధపడుతున్నారని, ఇతర ప్రాంతాలవారు కర్నూలు వచ్చేందుకు జంకుతున్నారని ఆరోపించారు.
‘పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూస్తూ.. హేళనగా మాట్లాడుతూ సంబంధాలను కలుపుకొనేందుకు భయపడుతున్నారు. ఆయన మాటలతో కర్నూలు ప్రజలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఒడిశా, దిల్లీ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వారి రాష్ట్రాల్లోకి రానీయకుండా నిషేధిస్తూ నిబంధనలు విధించాయి’ అని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి సీసీఎంబీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఎన్440కే వేరియంట్ అంత ప్రమాదకారి కాదని తేల్చి చెప్పారన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి విచారించాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు చంద్రబాబుపై కర్నూలు ఒకటో పట్టణ సీఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని రాకూడదన్న కుట్రతోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని సుబ్బయ్య ఆరోపించారు.
ఇవీచూడండి: అత్యవసర కేసుల విచారణకు సీజేఐ మార్గదర్శకాలు