ఆర్టీసీ బస్సు ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. కిలో మీటర్‌కు 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో బస్సు ఛార్జీల కనీస ధర ఐదు రూపాయలు, హైదరాబాద్‌లో ఆరు రూపాయలుగా ఉంది. కిలో మీటర్ కు 20 పైసల చొప్పున పెంచితే హైదరాబాదులో కనీస ధర ఎనిమిది రూపాయలు అవుతుందని అంటున్నారు. అదే జరిగితే చిల్లర సమస్య ఎదురు కావచ్చు అని చెబుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో కనీస ధర పది రూపాయలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆత్మీయ సమ్మేళనం జరపనున్నారు. ఛార్జీలు పెంచితే అందుకు అనుగుణంగా ఛార్ట్‌ను సవరించడం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు మరో రెండు రోజుల సమయం పట్టవచ్చని అంటున్నారు. దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచనున్నారు.
ఇదీ చూడండి: యువ వైద్యురాలి హత్యపై దిల్లీలోనూ ఆందోళనలు