భూమా అఖిలప్రియ కస్టడీ కోసం సికింద్రాబాద్ కోర్టులో బోయిన్పల్లి పోలీసులు పిటిషన్ వేశారు. ఏడు రోజులు (శనివారం నుంచి ఈనెల 15)వరకు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరారు.
అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉందన్న పోలీసులు.. ఆమె భర్త సహా మిగతా వారిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. సంతకాలు చేయించుకున్న దస్త్రాలు స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. నిందితుల అరెస్టు తర్వాత కిడ్నాప్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని బోయిన్ పల్లి పోలీసులు కోర్టుకు వివరించారు.
అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటరు దాఖలు చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశముందని, విచారణ నుంచి తప్పించుకోవచ్చని కోర్టుకు తెలిపారు.
అఖిలప్రియ ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె బెయిల్‌పై విడుదలైతే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చని, ఆమె చర్యల వల్ల స్థానికుల్లో అభద్రతాభావం నెలకొందని వివరించారు.
సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్న పోలీసులు.. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు.