కరోనా వ్యాప్తి ప్రభావం రక్తనిల్వలపై పడుతోంది. కేసులు పెరుగుతుండటం వల్ల దాతలు ముందుకు రావడం లేదు. ఫలితంగా నిల్వలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఏడు జిల్లాలోని ప్రధాన బ్లడ్ బ్యాంకుల్లో మే నెలలో 4,324, యూనిట్ల రక్తం అవసరముండగా ప్రస్తుతం కేవలం 796 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది.
మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న వారు రక్తదానం చేయవద్దని నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కౌన్సిల్ (ఎన్‌బీటీసీ) సూచించింది. అంటే తొలి డోసు తీసుకున్న అనంతరం 56 రోజులపాటు (8 వారాలు) రక్తదానం చేయొద్దంది. రెండో డోసు తీసుకున్న వారుకూడా 28 రోజుల వరకు రక్తం ఇవ్వవద్దని చెప్పింది. దీన్నిబట్టి రానున్న రెండు నెలల్లో రక్తం కొరత ఎక్కువయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు 180 వరకు రక్తనిధి కేంద్రాలుండగా ఇందులో 80 గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో అవసరమైనంత రక్తం లేకపోవడంతో పలువురి శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. క్షతగాత్రులు, గర్భిణులకు రక్తం దొరక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,800 మంది తలసీమియా బాధితులున్నారు. వీరికి రక్త మార్పిడి చేయాలంటే మున్ముందు కష్టమవుతుంది.
దాతల వద్దకే వెళ్లి సేకరణ
కరోనా నేపథ్యంలో దాతల వద్దకే వెళ్లి రక్తసేకరణకు నేషనల్ హెల్త్ మిషన్ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఇందుకు మూడు అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అపార్ట్‌మెంట్‌లు, కాలనీలు, ఇతర ప్రదేశాల్లో పది కంటే ఎక్కువ మంది రక్తదాతలు ఉంటే నేరుగా అంబులెన్స్‌ను అక్కడికే పంపి రక్తాన్ని సేకరిస్తున్నారు. గద్వాలలో చేపట్టిన డ్రైవ్ ద్వారా 114 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
వ్యాక్సిన్‌కు ముందే రక్తదానం
కరోనా నేపథ్యంలో రక్తదాతలు ముందుకు రావడం లేదు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా అవసరమైన నిల్వల్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దాతలు వ్యాక్సినేషన్‌కు ముందే రక్తదానం చేయాలి. మొదటి, రెండు డోసుల తర్వాత 56 రోజుల తర్వాత రక్తం ఇవ్వవచ్చు.
- డా.అనిల్‌కుమార్, నోడల్ అధికారి, బ్లడ్ సెల్ ఎన్‌హెచ్‌ఎం
నేడు ప్రత్యేక రక్త సేకరణ
హైదరాబాద్‌లోని అత్తాపూర్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఆదివారం ఎన్‌హెచ్‌ఎం(నేషనల్ హెల్త్ మిషన్) ఆధ్వర్యంలో రక్త సేకరణ డ్రైవ్‌ను చేపడతారు. వివరాలకు 99891 96413, 85009 49621, 90594 20555 నంబర్లను సంప్రదించి రక్తదానం చేయవచ్చు.
- ఇదీ చదవండి : పంజా విసురుతోన్న కరోనా... పాడెలెక్కుతున్న బాధితులు