Bandi letter To KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని మోదీకి కేసీఆర్ రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని సంజయ్ మండిపడ్డారు.
317 జీవో సవరణ, ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంటే వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. ప్రధానికి లేఖ రాసి, కొత్త డ్రామాలకు తెరదీసినట్లు కనిపిస్తోందని విమర్శించారు. కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు, నిర్ణయాల వల్ల సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. నేడు కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సంజయ్ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే.. కేసీఆర్ లేఖకు స్పందిస్తూ బహిరంగ లేఖ రాసినట్లు సంజయ్ చెప్పారు.
'ఎరువులు ఉచితంగా ఇవ్వాలి..'
ఎరువులు ఉచితంగా ఇస్తామని 2017 ఏప్రిల్ 13న కేసీఆర్ చెప్పారని బండి సంజయ్ అన్నారు. దాని ప్రకారం ఉచితంగా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలుచేయాలని కోరారు. వడ్లు, పత్తి, మొక్కజొన్న సహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడం సహా పంటల ప్రణాళికను ప్రకటించాలని కోరారు.
వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీమేరకు పాలీహౌజ్ సబ్సిడీని పునరుద్ధరించి.. ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్‌ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని.. తెలంగాణలోనూ అమలుచేయాలని కోరారు. విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేసి నకిలీ విత్తనాలను డిమాండ్ చేశారు.
ఉగాది వరకు టైం..
అకాల వర్షాలకు నష్టపోతున్న రైతులను ఆదుకొనేందుకు పంట బీమా పథకం అమలు సహా మార్కెట్లో ‘ఈ-నామ్’ పద్ధతిని ప్రవేశపెట్టి రైతులకు మేలుచేయాలని.. కేసీఆర్‌కు రాసిన బహిరంగలేఖలో బండి సంజయ్ కోరారు. బిందు సేద్యం కార్యక్రమంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు, డిమాండ్లను ఉగాధి నాటికి అమలుచేయాలని.. లేకుంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఎరువుల ధరలపై కేంద్రానికి కేసీఆర్ లేఖ..
ఎరువుల ధరలపై పెంచాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోదీకి నిన్న లేఖ రాశారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి.. ఇప్పుడు వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్రం నిర్ణయం ఉందని ఆక్షేపించారు. ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు భాజపా చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై నాగళ్లు ఎత్తి తిరగబడితేనే వ్యవసాయాన్ని కాపాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
ఇదీచూడండి: ఎరువుల ధరల పెంపుపై కేసీఆర్ తీవ్ర నిరసన.. ప్రధానికి బహిరంగ లేఖ..