కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వెనక కారణమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మూడు నెలల తరగతులకు మొత్తం ఏడాది ఫీజు వసూలు చేయడం ఆపేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. ఫీజు వేధింపులతో విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫీజుల పేరుతో వేధించడం ఆపకపోతే భాజపా యువ మోర్చా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నా... అధ్యాపకులు, సిబ్బందికి కార్పొరేట్ సంస్థలు వేతనాలు ఇవ్వడం లేదని సంజయ్ ఆరోపించారు. అధికార పక్ష నేతలు వసూళ్లకు అలవాటుపడి.. కార్పొరేట్ విద్యాసంస్థల అరాచకాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతిని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఎంపీ రేవంత్