BJP National Working Committee Meetings: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా ఎందుకు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలను ఆదేశించింది. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో సమావేశాల గురించి తెలిసేలా చేయాలని తెలిపింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందనే వాతావరణం కల్పించాలని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ప్రయాణించే బేగంపేట, రాజ్‌భవన్, హైటెక్స్ మార్గాల్లో ప్రజలతో స్వాగత కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని సూచించింది. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్న సందర్భంగా ఇక్కడ నివాసం ఉంటున్న ఆయా రాష్ట్రాల ప్రజలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధానకార్యదర్శులు హైదరాబాద్‌కు రానున్నారు. ఒక వేళ రోడ్ షోలకు వీలు కాకపోతే బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది.
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు, జాతీయస్థాయి ముఖ్యనేతలు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు మోదీ, అమిత్‌షా తదితరులు ఇక్కడే ఉంటారు. ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. పార్టీ అగ్రనేతలతో పాటు సుమారు 300 మంది ప్రముఖులు ఉండేలా నోవాటెల్ హోటల్ వద్ద బస ఏర్పాట్లను చేస్తున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు తెలంగాణను వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి: ఫేక్ ఐడీగాళ్ల ఆగడాల 'సాక్షి'గా.. పదోతరగతి విద్యార్థిని బలి..
'ఆనాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రపన్నారు'