Rajasingh fire on DSP: ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ నటించిన 'పుష్ప' సినిమా.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. సినిమా పేరు ఖరారు చేసినప్పటి నుంచి మొదలు.. విడుదలై కలెక్షన్లు కొల్లగొడుతూ నేటి వరకు హల్చల్ చేస్తూనే ఉంది. పాన్ ఇండియా మూవీగా ప్రకటించినప్పటి నుంచే హైప్ క్రియేట్ చేసుకున్న పుష్ప.. విడుదలైన ఒక్కో పాటతో ప్రేక్షకుల్లోకి దూసుకుపోయింది. ఒక్కోపాట సినిమాకు మంచి ప్రమోషన్ చేయగా.. చివరి సమయంలో విడుదల చేసిన ప్రత్యేక గీతం మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటంలో ముఖ్య పాత్రనే పోషించింది.
ప్రత్యేక గీతం.. ప్రత్యేక వివాదం..
"ఊ అంటావా మామ.. ఊ ఊ అంటావా" సాగే ఈ గీతం.. విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో నిలుస్తోంది. సమంత నర్తించిన ఈ పాట లిరిక్స్.. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కొంతమంది ఏకంగా కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ పాటను స్వరపరిచిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.. వివాదంలో చిక్కుకున్నాడు. ఏకంగా భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్.. డీఎస్పీ మీద ఫైరవుతున్నారు. క్షమాపణలు చెప్పకపోతే.. బయటతిరిగే పరిస్థితి ఉండదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు కూడా..!
అసలు డీఎస్పీ ఏం చేశాడు..?
పుష్ప విడుదలకు ముందు చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే.. ఆ సమయంలో పాటల గురించి మీడియా ప్రతినిధులు వేసిన ఓ ప్రశ్నకు డీఎస్పీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ప్రత్యేక గీతం గురించి ప్రస్తావిస్తూ.. ఏ పాట అయినా భక్తిభావంగానే ఉంటుందన్నాడు. అందుకు తగ్గట్టుగా.. అప్పటికప్పుడు కొన్ని ప్రత్యేక గీతాల ట్యూన్లలో దైవాన్ని స్తూతిస్తూ.. పాటలు ఆలపించాడు. ఆ సమయంలో అక్కడ నవ్వులు పూసినా.. తర్వాత వివాదం చెలరేగింది. ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం.. ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.
క్షమాపణ చెప్పాలి..
సినిమాలోని ఓ ప్రత్యేక గీతాన్ని దేవుడు పాటలతో పోల్చడం పట్ల ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవీశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. యావత్ హిందూ సమాజానికి డీఎస్పీ క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు బయట తిరగనివ్వరని హెచ్చరించారు.
మిశ్రమ స్పందన..
'పుష్ప' సినిమా.. నిన్న విడుదలై అన్ని బాషల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అటు కలెక్షన్లలో తగ్గేదెలే అంటూ.. సత్తా చాటుతోంది. సినిమాకు ముందు చిత్రబృందం అంతగా ప్రమోషన్లు చేయకపోయినా.. మిగతా రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇదిలా ఉండగా.. సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. తాము ఊహించిన అంచనాలు అందుకోలేకపోయిందని కొందరు.. బన్నీ ఇరగదీశాడని కొందరు వారివారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సినిమాలో పాటలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంటే.. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: