MLA Raghunandan Rao Fires on CM KCR: గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుపట్టడంపై భాజపా విమర్శలు గుప్పించింది. రాజ్యాంగ స్ఫూర్తి మేరకు పంచాయతీల్లో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని.. అవినీతి లేకుండా ఉండేందుకే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులను నేరుగా ఖాతాల్లో వేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతోన్న ఇబ్బందేంటని ప్రశ్నించారు.
BJP About Panchayat Funds: గ్రామాల్లో ఇసుకను తెరాస సర్కార్ అమ్ముకుంటోందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు దేశ సమగ్రతకు భంగంవాటిల్లేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లకు రాజ్యసభ సీట్లు కేటాయించారని మండిపడ్డారు. శంకరమ్మ వంటి ఉద్యమకారులు కేసీఆర్‌కు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అగ్రకులాల వారికే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
"విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా...అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది. పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే చెల్లుతుంది. సర్పంచులు ఆస్తులు అమ్ముకుని ఉపాధి కూలీలుగా, వాచ్‌మెన్లుగా, కాలం వెళ్లదీస్తున్నది వాస్తవం కాదా? తెరాస నేతల కమీషన్లకు అడ్డుకట్ట వేసేందుకు నేరుగా నిధులు ఇస్తున్నాం." - రఘునందన్ రావు, భాజపా ఎమ్మెల్యే
- ఇదీ చదవండి : పొలంలో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఏం జరిగింది?