జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార తెరాస పన్నుతున్న కుట్రలు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు వివరించినట్టు... భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఎమ్మెల్సీ రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డితో కలిసి ఆయన గవర్నర్‌ను కలిశారు. ఓటర్ల జాబితా మొదలుకొని దొంగ ఓట్ల వరకూ తెరాస అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భాజపా ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేస్తుంటే... అల్లర్లు జరగాలని తెరాస కోరుకుంటోందని విమర్శించారు. భాజపా అగ్రనేతలపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నప్పుడు... అమిత్ షా తెలంగాణకు వస్తే తెరాసకు భయమెందుకని ప్రశ్నించారు.
కరోనా, వరదల సమయంలో విఫలం చెందిన తెరాస... ఎన్నికలు తప్పించుకోవడానికి శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మజ్లిస్‌తో స్నేహం చేస్తున్న తెరాస... ఎన్నికల ప్రచారానికి దావుద్ ఇబ్రహీంను పిలిపించుకోవాలని ఎద్దేవా చేశారు. మతం పేరు చెప్పుకునే ఎంఐఎంను... పాతబస్తీలో పేద ముస్లింలు కూడా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జరగబోయే అక్రమాలను ఎదుర్కోవడానికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు.
ఇదీ చూడండి: 'మేనిఫెస్టోను అమలు చేసి ఇంటింటికి తిరిగి చెబుతాం'