BJP Leaders met DGP: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని భాజపా నేతలు డీజీపీని కోరారు. ఈ కేసులో నిందితులుగా పెద్ద వాళ్ల కుమారులున్నందునే దర్యాప్తులో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో జాప్యం, ప్రజాప్రతినిధుల పాత్ర లాంటి అంశాలపై తమకున్న అనుమానాలను డీజీపీకి వివరించారు. ఘటనలో నిందితులుగా పలువురు నేతల కుమారులుండటం వల్ల.. కేసును పక్కదారి పట్టించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. నిందితులు తప్పించుకోకుండా.. కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన భాజపా నేతలు రాంచందర్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బంగారు శృతి.. ఆ మేరకు వినతిపత్రం అందించారు.
"సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు,పేర్లు పెట్టడం తప్పు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగింది. బాధితురాలి పేర్లు, ఫోటోలు బయటపెట్టిన వాళ్లపై విచారణ చేపట్టాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో పబ్బు, క్లబ్ కల్చర్‌తో పాటు రేప్ కల్చర్ కూడా వచ్చింది. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉంది. సురక్షిత హైదరాబాద్ కావాలనేదే భాజపా లక్ష్యం. ఈ ఘటనలో పెద్ద వాళ్ల పిల్లలు ఉన్నారు కాబట్టి కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉంది." - రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ
"హైదరాబాద్ మైనర్ బాలిక అత్యాచార ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలని డీజీపీని కోరాం. కేసులో ఎఫ్ఐఆర్ జాప్యం, పెద్దల పాత్రపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాం."- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
"ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళా కమిషన్ అత్యాచార ఘటనపై స్పందించడం లేదు. ప్రభుత్వానికి తొత్తుగా మహిళా కమిషన్ వ్యవహరిస్తోంది. మహిళా కమిషన్ తక్షణమే బయటకు రావాలి. షీ టీమ్స్ ఉన్నా కూడా.. బాలికలకు రక్షణ లేకుండా పోయింది." -బంగారు శృతి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇవీ చూడండి: