తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు ఇదే అని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తెలిపారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమన్నారు. సెప్టెంబర్17ను అధికారికంగా నిర్వహించాలన్న భాజపా డిమాండ్ వెనుక ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. విమోచన దినోత్సవాన్ని పురష్కరించుకుని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని లక్ష్మణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం కాకుంటే ఉస్మానిస్థాన్గా మారేదన్నారు.
శాంతియుతంగా సెప్టెంబర్ 17ను జరుపుతున్న భాజపా కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఖండించారు. ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని తెరాస ప్రభుత్వం నిర్వహించడం లేదని ఆరోపించారు. దీనిపై శాసనమండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బంగారు శ్రుతి, ఇంద్రాసేనారెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 1948లో నిజాం రాజ్యం కుప్పకూలిన క్షణమిదే!