BJP Bheem Deeksha : సీఎం కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్లీ తెలంగాణభవన్ వద్ద బీజేపీ భీం దీక్ష పేరుతో పేరుతో గంటన్నరపాటు దీక్ష చేపట్టారు. భాజపా ఎంపీలు అర్వింద్, బాపూరావు సహా నేతలు పాల్గొన్నారు. తన దోపిడీని వ్యవస్థీకృతం చేసుకోవడానికే కొత్త రాజ్యాంగం తేవాలని కేసీఆర్ భావిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబపాలనను భరించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని బండి స్పష్టంచేశారు.
Bandi Sanjay Comments ON KCR : 'ఒక సామాన్యుడు ప్రధాని అయ్యారంటే, అది అంబేడ్కర్ భిక్షే. అంబేడ్కర్‌ను సగౌరవంగా సత్కరిస్తున్న ప్రభుత్వం మాది. ఆయన రాసిన రాజ్యాంగం వద్దని కేసీఆర్ అంటున్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఇదే. అంబేడ్కర్ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.'
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
రాజ్యాంగాన్ని అవమానించారు..
మరోవైపు.. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కూడా భాజపా భీం దీక్ష చేపట్టారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో భీమ్ దీక్షలో ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, తుల ఉమ పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల వరకు భాజపా భీం దీక్ష కొనసాగనుంది. ఎంతో ముందు చూపుతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్న లక్ష్మణ్.. అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించారని ఆరోపించారు.
సమానత్వం కోసం కృషి..
Laxman About CM KCR Comments on Constitution : 'పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం పట్ల కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు యావత్ దేశం ఆశ్చర్యపోయింది. బడ్జెట్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యాంగం ప్రస్తావన ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత.. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా భావి తరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. రెండేళ్లకు పైగా శ్రమించి రాజ్యాంగం రూపకల్పన చేశారు. అసమానతలు కూడిన దేశంలో సమానత్వాన్ని తీసుకువచ్చేందుకు మహనీయులు కృషి చేశారు.' - లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
సీఎం పదవికే కళంకం తెచ్చేలా..
ముఖ్యమంత్రి హోదాలో హుందాగా, గౌరవంగా ఉండాల్సిన కేసీఆర్.. ఆ పదవికే కళంకం తీసుకొస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేదర్ విమర్శించారు. భాజపా భీమ్ దీక్షలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో ఈటల పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు.
"అఖండ భారత దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. యావత్ భారత జాతి ఆయనను భారతరత్న అని పిలుచుకొని ప్రతి ఊరిలో, ప్రతి వాడలో అంబేడ్కర్ విగ్రహాలను పెట్టుకొని వారి జయంతి ఉత్సవాలను, వర్ధంతి సభలను జరుపుకుంటున్నాం. అలాంటి మహనీయుడు రూపొందించిన రాజ్యాంగం వల్లనే కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. ఆయనను సీఎం చేసింది కూడా ఆ రాజ్యాంగమే. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్.. ఇప్పుడు ఇష్టమున్నట్టు మాట్లాడుతూ ఆ పదవికే కళంకం తీసుకొస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతున్నారు. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాను అణచేసి స్వేచ్ఛ లేని, ధర్మం లేని కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్నారు." -ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
సంబంధిత కథనాలు :