Polavaram Project News: పోలవరం వరద తిరుగు జలాల ప్రభావంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధ్యయనం చేసిందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డ్ సైతం లెక్కించిందని పేర్కొంది. ఈ అంశంపై ఐఐటీ హైదరాబాద్ చేసిన అధ్యయనాన్ని తోసిపుచ్చింది. ఆ అధ్యయనం తీరు, నివేదిక తప్పులతో కూడుకున్నవని పేర్కొంది. ఆ నివేదికను పట్టించుకోనవసరం లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కొన్నాళ్ల క్రితం సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఎన్.ఎన్.రాయ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అందులో పలు విషయాలను ప్రస్తావించారు. ఆ వివరాలివీ...
‘‘బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనానికి ఐఐటీహెచ్.. వెయ్యేళ్లలో, పదివేల ఏళ్లలో వచ్చే వరదను ‘ఫ్లడ్ ప్రీక్వెన్సీ అప్రోచ్’లో లెక్కకట్టింది. ఇందులో ఎగువన, దిగువన విలువల్లో చాలా తేడాలుంటాయి. ఈ పద్ధతిలో కాకుండా హైడ్రో మెట్రలాజికల్ అప్రోచ్‌లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. బీఐఎస్ ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు 50 ఏళ్లలో వచ్చే 25.53 లక్షల క్యూసెక్కుల వరదను పరిగణనలోకి తీసుకొని, గోదావరి జలవివాద ట్రైబ్యునల్ ఒప్పందం (అవార్డ్) ప్రకారం.. 500 ఏళ్లలో వచ్చే 36 లక్షల క్యూసెక్కుల వరదను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని కేంద్ర జలసంఘం తరఫున గోపాలకృష్ణ కమిటీ 25.53 లక్షల క్యూసెక్కులు, 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి తలెత్తే బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసింది.
* బ్యాక్‌వాటర్‌పై ఐఐటీహెచ్ అధ్యయనం 1డి, 2డి మోడల్ ఆధారంగా జరిగింది. పోలవరం డ్యాం వద్ద 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేసినప్పుడు.. అక్కడ మట్టం ఏ స్థాయిలో ఉంటుందో 1డి మోడల్ ప్రకారం పేర్కొనలేదు. 2డి మోడల్‌లో కూడా రివర్ క్రాస్ సెక్షన్‌కు సంబంధించిన వివరాలు పొందుపరచలేదు.
* 1డి మోడల్‌లో భద్రాచలం వద్ద మాత్రమే నీటి మట్టాన్ని పేర్కొన్నారు. డ్యాం ఉన్నప్పుడు, లేనప్పుడు నీటిమట్టాలు రివర్ క్రాస్ సెక్షన్‌లోని అన్ని చోట్లా పేర్కొనాలి. పోలవరం వద్ద డ్యాం ఉన్నప్పుడు, లేనప్పుడు, వరద విడుదల సమయంలో నీటిమట్టం వివరాలు పేర్కొనడం అన్నిటికన్నా ముఖ్యం.
* రివర్ క్రాస్ సెక్షన్‌పై ఐఐటీహెచ్ నివేదిక.. గోపాలకృష్ణన్ కమిటీ నివేదికతో సరిపోలలేదు. నీటి ప్రవాహానికి సంబంధించిన క్రాస్‌సెక్షన్ ఐఐటీ నివేదికలో నది గట్టు దాటి ఉంది. ఈ నివేదికలోని 1డి మోడల్ ఫలితం ప్రకారం భద్రాచలం వద్ద బ్యాక్‌వాటర్ ప్రభావం ఏమీ లేనట్లుగా ఉంది. అయితే పోలవరానికి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినపుడు బ్యాక్‌వాటర్ ప్రభావం భద్రాచలం వరకే కాదు దానికి 26 కి.మీ. ఎగువ భాగంలో ఉన్న దుమ్ముగూడెం వరకు ఉంటుందని తెలిపింది.
* ఐఐటీ 2డి మోడల్ అధ్యయనంలో.. 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరం డ్యాం గేట్లను పది మీటర్లు ఎత్తితే భద్రాచలం వద్ద నీటిమట్టం 60.03 మీటర్లు, 20 మీటర్లు ఎత్తితే నీటిమట్టం 50.84 మీటర్లు.. అసలు డ్యాం లేకుంటే నీటిమట్టం 59.52 మీటర్లు ఉంటుందని తెలిపింది. అయితే 2డి మోడల్‌లో పోలవరం డ్యాం వద్ద చేసిన అధ్యయనం తప్పులతో ఉంది. గేట్లు పది మీటర్లు ఎత్తినప్పుడు పోలవరం వద్ద నీటిమట్టం 51.33 మీటర్లు (168.40 అడుగులు), 20 మీటర్లు ఎత్తినప్పుడు 45.45 మీటర్లు ఉంటుందని పేర్కొంది. పోలవరం డ్యాం వద్ద 36 లక్షల క్యూసెక్కులకు సీడబ్ల్యూసీ డిజైన్ చేసిన స్పిల్‌వే ప్రకారం వరదను విడుదల చేసే మట్టం 41.16 మీటర్లు (135 అడుగులు) మాత్రమే. కాబట్టి ఐఐటీ హైదరాబాద్ చేసిన అధ్యయనాన్ని బ్యాక్ వాటర్ అంచనాకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: