Hanuman Land: తిరుమలలోని అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలానికి ఈనెల 16న భూమిపూజ నిర్వహించనున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రిని ఆంజనేయుడి జన్మస్థలంగా తితిదే ప్రకటించింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు భూమిపూజ నిర్వహించనుంది.
ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం, ఆర్జిత సేవలపై 15న నిర్ణయం
కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్ల జారీపై ఈనెల 15న అధికారులతో చర్చించనున్నట్లు ఈవో తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వరదలతో దెబ్బతిన్న శ్రీవారిమెట్టు మార్గాన్ని ఏప్రిల్ నెలాఖరుకల్లా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విపత్తుల సమయంలో పునరావాస కేంద్రాలుగా తితిదే కల్యాణ మండపాలు
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు పునరావాస కేంద్రాలుగా కల్యాణ మండపాలను ఇచ్చేందుకు తితిదే సిద్ధమైంది. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. ప్రకృతి విపత్తులు, మెడికల్ ఎమర్జెన్సీ సంభవించిన సమయాల్లో ప్రజలకు పునరావాసం కల్పించడంతోపాటు వీరికి సేవ చేసే సిబ్బందికి అక్కడ వసతి కల్పించాలని నిర్ణయించింది.
తితిదే ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే అంతర్జాలంలో(వెబ్‌సైట్)లో శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇదీ చదవండి..