దేశ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి అయినా జస్టిస్ ఎన్వీ రమణ ఎంపికపై బెజవాడ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. తాము పని చేసే కోర్టులోనే ఎన్వీ రమణ కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేశారని గుర్తు చేసుకున్నారు. దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని ఆయన అధిరోహించబోతున్న వేళ.. తామంతా గర్వపడుతున్నామని చెప్పారు. సామాన్యులకు న్యాయం అందించాలనే తపన ఎప్పుడూ ఆయనలో ఉండేదన్నారు. జిల్లాలోని చాలా చోట్ల నూతన కోర్టు భవనాల నిర్మాణం ఆయన చొరవతోనే జరిగిందని వెల్లడించారు. సీనియర్, జూనియర్ న్యాయవాదులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడేవారని తెలిపారు. ఇంగ్లీషుతో పాటు విషయపరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించే వారని చెప్పారు.
గర్వపడుతున్నాం...
'జస్టిస్ ఎన్వీ రమణ నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి. తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీషుపై మంచి పట్టు సాధించారు. ఇవాళ సీజేఐగా ఎంపికయ్యారు. ఇది తెలుగు జాతికే గర్వకారణం. 1983 సంవత్సరంలో విజయవాడ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అక్కడ్నుంచి అంచెలంచెలుగా ఎదిరిగారు. మా బార్ అసోసియేషన్‌కు అన్ని విధాలా సహకరించారు. సుమారు 60 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు కోర్టు భవనాల్లో ఆయన పాత్ర మరవలేనిది'. - చలసాని అజయ్ కుమార్,మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్
ఆయన కృషి వల్లే...
జస్టిస్ ఎన్వీ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు ఫోర్ట్ పోలియో జడ్జిగా పని చేశారు. ఆ సమయంలో 15 కొత్త కోర్టు భవనాలను తీసుకొచ్చారు. జీప్లస్ భవనాల అనుమతుల విషయంలోనూ చొరవ తీసుకున్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. అనేక మంది న్యాయమూర్తులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత కూడా ఎన్వీ రమణదే. ప్రజల మనిషిగా మరింత రాణించాలని కోరుకుంటున్నాం - జి.వెంకటేశ్వరరావు,బెజవాడ బార్ ఆసోసియేషన్ మాజీ అధ్యక్షులు.
స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాం...
'సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణకు పదోన్నతి రావటం ఎంతో ఆనందం. ప్రతి ఒక్కరి తరపున అభినందనలు తెలుపుతున్నాం. ఆయన ఎంపికతో విజయవాడ బార్ అసోసియేషన్ పేరు విశ్వవ్యాప్తమైంది. అనేక అంశాల్లో ఆయన సలహాలు తీసుకునేవాళ్లం. సీనియర్, జూనియర్ న్యాయవాది అనే తేడా లేకుండా మాట్లాడుతారు. నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తారు. ఆయనను స్ఫూర్తిగా తీసుుకుని.. ప్రజలకు న్యాయ సాయం చేయటంలో ముందుంటాం'- న్యాయవాది, బెజవాడ బార్ అసోసియేషన్
న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగానూ రాణించాలని.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టాలని పలువురు న్యాయవాదులు ఆకాంక్షించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేందుకు నిర్మాణాత్మక మార్పులు నాంది పలకాలని కోరారు. ఆయన ఎంపికతో బెజవాడ బార్ అసోసియేషన్ పేరు చిరస్థాయిలో నిలుస్తుందన్నారు.