Bangladeshis caught stealing from ATM : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరంలోని కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారి పక్కన సినిమా హాళ్ల సెంటర్ ఉంది. రాత్రి సమయం కావడంతో కానిస్టేబుల్ మణీంద్ర అక్కడ బీట్ విధులు నిర్వహిస్తున్నాడు. సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం బయట ఓ ట్రక్ నిలిచివుంది. మెట్లపై ఓ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. వివరాలు ఆరా తీద్దామని కానిస్టేబుల్ అక్కడే ఉన్న హోంగార్డును వెంట తీసుకెళ్లాడు. వారు అక్కడికి వెళ్లేసరికి బయట ఉన్న వ్యక్తి, లోపల ఉన్న ఐదుగురు పరారయ్యారు. హోంగార్డును ఏటీఎం వద్ద కాపాలా ఉంచి, వారిని మణీంద్ర వెంబడించాడు. అతికష్టమ్మీద ఒకరిని పట్టుకున్నాడు. చేతిని గట్టిగా కొరికినా వదల్లేదు. ఆతర్వాత వెంటనే స్టేషన్‌కు సమాచారం అందించాడు. అదనపు బలగాలు వచ్చి దొంగల్లో ఒకరిని పట్టుకోగలిగారు. మిగిలిన నలుగురు పరారయ్యారు.
తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలింది.. దొరికిన ఇద్దరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించగా ఈ ముఠా గురించి అనేక అంశాలు బయటకు వచ్చాయి. అవి విని విస్తుపోవడం పోలీసుల వంతైంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న రీతిలో ఈ ముఠా చిన్నా చితకా దొంగతనాలకు పాల్పడదు. కేవలం ఏటీఎంలే లక్ష్యంగా చోరీలకు తెగబడుతుంటారు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుందన్న ఆశతో ఈతరహా నేరాలకు పాల్పడుతుంటారు. వీరంతా బంగ్లాదేశీయులుగా తేలింది. వీరు చోరీకి ఎంపిక చేసుకున్న ప్రాంతానికి చేరుకోవడానికి వాహనాలను దొంగిలించి వాటిల్లోనే వెళ్తారు. గన్నవరంలో వీరు లక్ష్యంగా చేసుకున్న ఏటీఎం కేంద్రంలో రెండు యంత్రాలు ఉన్నాయి.
వీటిని అక్కడ పగలగొట్టి చోరీ చేయడం కష్టమని భావించి, ఏకంగా వీటినే శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడ పగలగొట్టి నగదును తీసుకెళ్లాలని తలచారు. ఇందుకు గాను పరిసర ప్రాంతాల్లోని సరకు రవాణాకు ఉపయోగించే ట్రక్‌ను దొంగతనం చేసి ఏటీఎం కేంద్రం వద్ద నిలిపారు. ఆ సమయంలో ఓ ఏటీఎంలో రూ.18లక్షలు, మరో దాంట్లో రూ.20లక్షల నగదు ఉంది. ఇంతలో పోలీసులు రావడంతో ప్రణాళిక వికటించింది.
ఆగస్టు మొదటి వారంలో దేశంలోకి..మొత్తం ఎనిమిది మంది సభ్యుల ముఠా ఈనెల మొదటి వారంలో భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది. వీరు సరిహద్దుల గుండా తొలుత పశ్చిమబెంగాల్‌లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి రైలు ద్వారా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అడుగుపెట్టారు. అక్కడ ఓ ఏటీఎం కేంద్రంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఈ ప్రయత్నంలో ఇద్దరు పట్టుబడగా ఆరుగురు పరారయ్యారు. వీరు రైలు ద్వారా ఈనెల 13న విజయవాడ నగరంలో దిగారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగి, ఏటీఎం కేంద్రాల వద్ద రెక్కీ నిర్వహించారు. 14వ తేదీ అర్ధరాత్రి చోరీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకుల బందోబస్తు కోసం భారీగా పోలీసు బలగాలు ఉండడంతో ప్లాన్ మార్చుకున్నారు. శివారు ప్రాంతమైన గన్నవరం వెళ్లారు. అక్కడా పలుమార్లు రెక్కీ నిర్వహించారు. రాత్రి సమయాలలో రైల్వేస్టేషన్లు, పొలాల్లో నిద్రించేవారు. పట్టుబడిన ఇద్దరి వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు సమాచారం. ముఠా సభ్యులు అంతా నకిలీ ఆధార్ కార్డులతో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు.
వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు..పట్టుబడిన నిందితుల వేలిముద్రలు సేకరించిన గన్నవరం పోలీసులు, వాటిని రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. ఎక్కడి నుంచి వీరి గురించిన సమాచారం అందలేదు. దొంగతనాల్లో ఎక్కడా వేలిముద్రలు పడకుండా చేయడం వీరి శైలి. ఇందుకు గాను వీరు తమ చేతులకు రుమాళ్లు కట్టుకుని ఏటీఎం యంత్రాలను ముట్టుకుంటారు. ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తపడుతుంటారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడా వీరి వేలిముద్రలు నమోదు కాలేదు. నేరం చేసిన వెంటనే వారు ఉపయోగించే ఫోన్లను స్విచాఫ్ చేస్తుంటారు. ఎంచుకున్న మరో ప్రాంతానికి చేరిన తర్వాతే ఆ సిమ్‌ను ఉపయోగిస్తారు. వీరి కదలికలను పోలీసులు గుర్తించకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నట్లు తెలిసింది.
మిగిలిన వారి కోసం వేట..దొరికిన వారు బంగ్లా దేశీయులు కావడంతో పోలీసులు ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరా దృశ్యాల కోసం పోలీసులు పరిశీలించారు. 15వ తేదీ వరకే వాటిల్లో దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో దొంగల ఆనవాళ్లు దొరకబుచ్చుకోవడం కష్టంగా మారింది. పారిపోయిన నలుగురి కోసం వేట సాగిస్తున్నారు.
ఇవీ చదవండి: