Bandi Sanjay Fires on CM Kcr: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని బాధ్యుడిని చేయాలని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తన కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని విమర్శించారు. దీంతో సీఎం బాగా డిప్రెషన్‌లోకి వెళ్లారంటూ బండి వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తేనే మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయి.. మా పేరు చెప్పి మీటర్లు పెడితే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోడానికి ప్రజలు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని నలుగురు మహిళలు చనిపోయారు.. దేశంలో ఎక్కడా జరగని సంఘటన ఇది అని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వాళ్లని ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంట లోపల 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అక్కడ కనీసం మహిళా డాక్టర్‌ను పెట్టకుండా శస్త్ర చికిత్సలు చేయటం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనకు ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలన్నారు.
'గంటలోగా 34 మందికి కు.ని.శస్త్రచికిత్సలు చేశారు. శస్త్రచికిత్సల తర్వాత బెడ్‌లు లేకున్నా పట్టించుకోలేదు. మృతులంతా పేద కుటుంబాలకు చెందిన కూలీలు. బాధిత కుటుంబాలను ఎవరూ పరామర్శించలేదు. పేదలు, రైతులు చనిపోవడం రాష్ట్రంలో సర్వసాధారణంగా మారింది. ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి హరీశ్‌రావు రాజీనామా చేయాలి. డీహెచ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి. హెల్త్ డైరెక్టర్ పైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతినెల ఆయన డబ్బు మూటలు పంపిస్తారు కాబట్టి కేసీఆర్ చర్యలు తీసుకోవట్లేదు. రేపు డీహెచ్‌ను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని చేస్తారు.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: