Balka suman on singaren strike: సింగరేణి కార్మికులకు తెరాస అండగా ఉంటుందని.. సమ్మె ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. అదానీకి కట్టబెట్టేందుకే లాభాల్లో ఉన్న సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నారని కేంద్రంపై బాల్క సుమన్ ధ్వజమెత్తారు. గుజరాత్, ఒడిశా, జార్ఖండ్‌లో వేలాన్ని ఆపిన కేంద్ర ప్రభుత్వం... ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసినప్పటికీ స్పందించడం లేదని ఆరోపించారు.
Singareni Trade unions strike: సింగరేణి కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె చేస్తున్నా.. భాజపా నేతల్లో ఉలుకూ పలుకూ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. బొగ్గు గనుల వద్దకు భాజపా నేతలు వస్తే కార్మికులు, యువత నిలదీయాలని బాల్క సుమన్ సూచించారు. కార్మిక లోకం భాజపాపై తిరగబడాలన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష పెంచుకుందని... రైతులకు అన్యాయం చేస్తున్న భాజపా సర్కారు ఇప్పుడు సింగరేణి కార్మికులపై పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేలాన్ని కేంద్రం ప్రభుత్వం ఆపేసి.. వాళ్లకే అప్పగించింది. సింగరేణి బ్లాకులకు మాత్రం వేలం వద్దని యాజమాన్యం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసినా.. కనీస స్పందన లేదు. ఇదంతా చూస్తుంటే.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష పట్టినట్టే చూస్తోంది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డి, ఎంపీలు.. సంబంధిత మంత్రి దగ్గరికి, మోదీ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి. కార్మికులు పోరాటం చేస్తున్నారని చెప్పాలి. మూడు రోజుల నుంచి కార్మికులు పోరాడుతుంటే.. కనీసం పట్టించుకోకుంటే.. దానికి తగిన గుణపాఠం వాళ్లే చెప్తారు." - బాల్క సుమన్, ప్రభుత్వ విప్
తెలంగాణకు బొగ్గు దక్కకుండా చేసి విద్యుత్ రంగాన్ని దెబ్బ తీయాలని భాజపా కుట్ర పన్నుతోందని బాల్క సుమన్ ఆక్షేపించారు. కర్షకులు, కార్మికులతో పెట్టుకుంటున్న భాజపాకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. దేశాన్ని ప్రైవేట్ రంగ భారత్‌గా మారుస్తోందని ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి: