ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను వచ్చే నెల మూడో వారంలో నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వారం నుంచి పది రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. కొవిడ్-19 మూడో వేవ్ ప్రభావాన్ని బట్టి వచ్చే వారంలో చర్చించి ఈ సమావేశాల ప్రారంభ తేదీని, పని దినాలను ఖరారు చేసే అవకాశం ఉందని ఏపీ అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
కొవిడ్ కారణంగా బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడంవల్ల వచ్చే నెల జరిగే వర్షాకాల సమావేశాలను వీలైనంత ఎక్కువ రోజులు జరపాలనే అభిప్రాయం ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందుకు దారితీసిన పరిణామాలను, గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉందని అధికార వైకాపా సీనియర్ నేత ఒకరు తెలిపారు. కేంద్రం సూచించిన సవరణలను పూర్తిచేసి ‘దిశ’ బిల్లును మరోసారి అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక?
ఈ సమావేశాల సందర్భంగానే ఏపీ మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ల స్థానాలకు ఎన్నికలను నిర్వహించే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మే నెలలో ఛైర్మన్, జూన్‌లో డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: SUB REGISTRATION OFFICE: ఆ కార్యాలయాల్లో అంతా ధనమూలమిదం జగత్