ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీనికి 'అసని తుపాను' అని నామకరణం చేశారు. ఈ తుపాను ధాటికి అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇప్పటికే అక్కడ శనివారం నుంచి వర్షాలు పడుతున్నాయి.
ఈ క్రమంలోనే అల్పపీడనం తుపానుగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయని, తీర ప్రాంతాల్లో గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం అండమాన్, నికోబార్ దీవులతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్‌లపై అధికంగా ఉంటుందని పేర్కొంది. తుపాను ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లపై అసని తుపాను ప్రభావం ఉండొచ్చనే అంచనాలున్నాయి.