APPSC News: రెండూ నియామక సంస్థలే కానీ.. ఎన్ని వైరుధ్యాలో! ఎన్ని లోపాలో! ఒకటి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుండగా మరొకటి ప్రణాళికారాహిత్యంతో పనిచేస్తోంది. ఒకటి పూర్తిగా విద్యావంతుల పర్యవేక్షణలో నడుస్తుండగా మరొకటి రాజకీయ కారణాల వల్ల అనర్హులతో నిండిపోతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మధ్య ప్రధాన తేడాలివి. సివిల్స్ నోటిఫికేషన్ జారీ అయ్యాక ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా యూపీఎస్సీ నియామకాలను పూర్తిచేస్తోంది. గ్రూపు-1 నియామకాలను పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీకి రెండు నుంచి నాలుగేళ్ల వరకు పడుతోంది. యూపీఎస్సీ జారీ చేసే నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు పకడ్బందీ ప్రణాళికతో సన్నద్ధమై.. రాత పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా త్వరగానే విధుల్లో చేరిపోతున్నారు. ఏపీపీఎస్సీ విషయంలో నోటిఫికేషన్ జారీ దగ్గర నుంచి విధుల్లో చేరే వరకు అభ్యర్థులను రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినప్పటికీ.. ఏపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తుండడం, సభ్యుల అర్హతలు అంతంతమాత్రంగానే ఉండడం, ఇందులో పనిచేసే అధికారుల్లో కొందరి వైఖరి వల్ల నియామకాలు రసాభాసగా మారుతున్నాయి. ఎఎంవీఐ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామకాలకు 2008లో నోటిఫికేషన్ ఇస్తే నియామకాలు పూర్తయ్యేసరికి 2017 వచ్చింది.
అంతా దైవాధీనం... ఏపీపీఎస్సీ నుంచి సకాలంలో నోటిఫికేషన్లు రావు. వచ్చినా వెంటనే నియామకాలు జరగవు. పూర్తయ్యేందుకు ఎంతకాలం సమయం పడుతుందో కమిషన్ సభ్యులే చెప్పలేరు. నోటిఫికేషన్ జారీ నుంచి ఇతర అన్ని విషయాల్లో ఏదోక సమస్య వస్తూనే ఉంటోంది. కోర్టు కేసులూ తప్పవు. అభ్యర్థులు ఆందోళనలూ పరిపాటిగా మారింది. ఏపీ ప్రభుత్వం/కమిషన్ వైఖరే ఇందుకు కారణం. 2018 డిసెంబరులో ఇచ్చిన గ్రూపు-1 నోటిఫికేషన్ నియామకాలు ఇప్పటికీ పూర్తికాలేదు. త్వరలో ఇంటర్వ్యూలు జరగబోతున్నా.. ఎంపికైన వారు విధుల్లో చేరేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. యూపీఎస్సీ దేశవ్యాప్తంగా నియామకాల ప్రక్రియను పకడ్బందీగా చేస్తోంది. 2021 ఫిబ్రవరిలో సివిల్స్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలను ఇటీవల ప్రకటించింది. త్వరగా నియామకాలు చేపడుతున్నందున పరీక్షల్లో సత్తా చాటిన వారు విధుల్లో వెంటనే చేరి, సర్వీసుపరంగా కూడా ప్రయోజనం పొందుతున్నారు. 2022లో జారీచేసిన నోటిఫికేషన్ మేరకు ఈ నెల 5న సివిల్స్ ప్రిలిమ్స్ దేశవ్యాప్తంగా జరగబోతుంది. ప్రధాన పరీక్షల నిర్వహణకు కూడా షెడ్యూలును ఇప్పటికే యూపీఎస్సీ ప్రకటించింది.
నోటిఫికేషన్‌లో చెప్పలేదని!.. 2018 నోటిఫికేషన్ అనుసరించి ప్రధాన పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేసి ఏపీపీఎస్సీ ప్రకటించిన ఫలితాలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అలా ఫలితాలు వెల్లడించగా తొలిదశలో ఎంపికైన వారిలో 202 మంది అనర్హులయ్యారు. ఈ వివాదం ప్రస్తుతం నడుస్తోంది. డిజిటల్ మూల్యాంకనం గురించి నోటిఫికేషన్‌లో పేర్కొనకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. గతంలో గ్రూపు-1 రాత పరీక్షల ప్రశ్నల్లో దొర్లిన తప్పులు వివాదాస్పదమై చివరికి మౌఖిక పరీక్షలు రద్దయ్యాయి. మళ్లీ ప్రధాన పరీక్షలు నిర్వహించి, మౌఖిక పరీక్షలు జరిపారు.
సన్నద్ధతపై తికమక!.. ‘2018 గ్రూపు-1 నోటిఫికేషన్ అనుసరించి ఈ నెల 15 నుంచి అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యేవారిలో పలువురు ఈ నెల 5వ తేదీ సివిల్స్ ప్రిలిమ్స్ రాయనున్నారు. నేను మెయిన్స్ రాసేందుకు కూడా ప్రీపేర్ అవుతున్నా. ఈ పరిస్థితుల్లో గ్రూప్ 1 మౌఖిక పరీక్షలు రావడం వల్ల సన్నద్ధలో తేడాలు వస్తున్నాయి’ అని ఓ అభ్యర్థి చెప్పారు. ‘ఇలాంటి పరిణామాలు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి’ అని ఉద్యోగరంగ నిపుణుడు పేర్కొన్నారు. ‘ఏయే అంశాల్లో కోర్టుల నుంచి ఆదేశాలు, అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయో.. గుర్తించి, వాటికి తగ్గట్లు నిబంధనలను పటిష్ఠంగా తయారుచేసుకోవాలి’ అని సూచించారు.
తొలి నుంచీ జాగ్రత్తలు అవసరం..
'నోటిఫికేషన్ జారీకి ముందే యూపీఎస్సీ అన్ని కోణాల నుంచి ఆలోచిస్తుంది. సకాలంలో నియామకాలు పూర్తిచేసి అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచితే.. ఫలితాలు బాగుంటాయి. గత రెండేళ్ల నుంచి కొవిడ్ ప్రభావం వల్ల నియామకాలు కాస్త ఆలస్యమయ్యాయి. ఏడాదిలోగా వీటిని పూర్తిచేయాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ పనిచేస్తోంది.'- యూపీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ చలం
ఇవీ చదవండి:గ్రూప్-1కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీపడుతున్నారంటే?