SCERT post: నిబంధనలన్నీ పక్కనపెట్టిన ప్రభుత్వం.. ఆదర్శ పాఠశాల అధ్యాపకురాలు ఒకరికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ)లో శాశ్వత కొలువు ఇచ్చింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వానికి ఇలాంటి అధికారాలే ఉంటే.. పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ అధికారులను ఎందుకు నియమించడం లేదని మండిపడుతున్నాయి. తనకు ఎస్‌సీఈఆర్‌టీలో కొలువు ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా పాలమాకులలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)గా పనిచేసే ఒకరు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబరు 10న సీఎం కార్యదర్శి నుంచి పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలి కార్యాలయానికి లేఖ అందింది. ఆదర్శ పాఠశాల నుంచి ఎస్‌సీఈఆర్‌టీలో శాశ్వత కొలువు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 19న అధికారులు నివేదిక పంపారు. అనంతరం మే 17న అప్పటి విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా జీవో 12 జారీ చేశారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి.. సంబంధిత నిబంధనలకు మినహాయింపునిచ్చి... ఎస్‌సీఈఆర్‌టీలో అధ్యాపకురాలిగా నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వీలుకాదని విద్యాశాఖ నివేదిక?
ఆదర్శ పాఠశాలలు ఒక సొసైటీ కింద ఉన్నందున.. అందులోని ఉద్యోగికి ప్రభుత్వ పోస్టు అయిన ఎస్‌సీఈఆర్‌టీ అధ్యాపకురాలిగా కొలువు ఇవ్వడం వీలుకాదని పాఠశాల విద్యాశాఖ అధికారులు నివేదిక పంపినట్లు తెలిసింది. అయినా, ప్రభుత్వం మాత్రం సంబంధిత నిబంధనలకు మినహాయింపు ఇవ్వడం గమనార్హం. ఆదర్శ పాఠశాలలో నాన్ గెజిటెడ్ అయిన పీజీటీకి ఎస్‌సీఈఆర్‌టీలో గెజిటెడ్ పోస్టు ఎలా ఇస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జూనియర్ అధ్యాపకురాలికి డిప్యూటీ ఈవో స్థాయి పోస్టు ఇవ్వడమేంటంటున్నారు. సాధారణంగా ఎస్‌సీఈఆర్‌టీలో నేరుగా పోస్టింగే ఇవ్వరు. ప్రభుత్వ బీఈడీ కళాశాల(సీటీఈ)లు లేదా డైట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని బదిలీపై పంపిస్తారు. తాజా వ్యవహారంలో మాత్రం నిబంధనలను పక్కనబెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి.
పూర్తిగా అక్రమం..
'మోడల్ స్కూల్ సొసైటీ నుంచి ఎస్‌సీఈఆర్‌టీలో నియమించడం పూర్తిగా అక్రమం. సర్వీసు నిబంధనలన్నింటినీ పక్కనబెట్టి ఇవ్వడం అన్యాయం. ప్రభుత్వానికి అన్ని అధికారాలే ఉంటే ఎస్‌సీఈఆర్‌టీలో ఖాళీలన్నింటినీ అర్హులతో నింపాలి. ఎంఈవోలను నియమించాలి. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలి. కేవలం పలుకుబడి ఆధారంగా కొలువులు కట్టబెట్టడాన్ని ఖండిస్తున్నాం.'- చావ రవి, రాష్ట్ర కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్
ఇవీ చదవండి:GROUP 1: గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు