రైతుబంధు పథకం కింద ఇప్పటివరకూ సొమ్ము పొందని పొలం యజమానులు ఈ నెల 13లోగా దరఖాస్తు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది. ఈ ఏడాది జనవరి చివరి నాటికి పట్టాదారు పాసుపుస్తకం పొంది, గతంలో ఒక్కసారి కూడా ఈ పథకం సొమ్ము తీసుకోని వారు మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని రైతుబంధు సమితి మంగళవారం తెలిపింది. భూ యజమానులు దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసుపుస్తకం నకలు, ఆధార్, బ్యాంకు ఖాతా కాపీలను వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని సూచించింది.
కొత్తగా 61 లక్షల మందికి పాసుపుస్తకాలు
ఈ ఏడాది జనవరి చివరి నాటికి కొత్త పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతుల వివరాలను రెవెన్యూశాఖ ధరణి పోర్టల్‌లో నమోదు చేసింది. జనవరి నాటికి మొత్తం 61 లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేసినట్లు రెవెన్యూశాఖ తెలిపింది. వారి వివరాలను ఇప్పటికే వ్యవసాయశాఖకు ఇచ్చింది. వీరిలో 2.40 లక్షల మంది ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయలేదు. వారి వివరాలను ఏఈఓలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
కొత్త వారికి ఈ నెల 13 వరకూ దరఖాస్తుకు గడువు ఇచ్చినందున అప్పటివరకూ రాష్ట్రంలో రైతులకు ఈ పథకం సొమ్ము జమ చేయడానికి అవకాశాలు లేవని తెలుస్తోంది. సాగు ఖర్చులకు రైతుబంధు సొమ్ము కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్