AP UNEMPLOYED JAC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని హర్షిస్తూ.. విశాఖలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ ఐకాస పాలభిషేకం చేసింది. 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నందుకుగానూ కేసీఆర్‌కు ఐకాస అభినందనలు తెలిపింది. ఏపీలోనూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు 2లక్షల 32వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. గ్రూప్స్ ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని.. వయోపరిమితిని పెంచాలని కోరారు.
తెలంగాణలో ఉద్యోగాల జాతర..
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.
మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని సీఎం పేర్కొన్నారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం తెలిపారు.
'ఇకపై రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్లు అమలవుతాయి. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు. నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అన్ని పోస్టులకు 95 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. అభ్యర్థులు సొంత జిల్లా, జోన్లలో రిజర్వేషన్లు కలిగి ఉంటారు. ఇతర జిల్లాలు, జోన్లలో మిగతా 5 శాతం ఉద్యోగాలకు పోటీ. జిల్లా, జోన్లలో క్యాడర్ పోస్టులకు స్థానిక అభ్యర్థులకు అర్హత ఉంటుంది.' - సీఎం కేసీఆర్
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.... రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్