తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులకు ‘మార్గం’ సుగమం అవుతోంది. దసరాకు నడిచినా.. నడవకపోయినా సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాత్రం దసరాకే బస్సులు నడపాలన్న అభిప్రాయంతో ఉంది. ఒకటి రెండు మార్గాల్లో మినహా మిగిలిన విషయాల్లో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయం దిశగా అడుగులు పడుతున్నాయి.
రెండు రాష్ట్రాలు చెరో 1.61 కిలోమీటర్ల చొప్పున బస్సులు నడిపేందుకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఏయే మార్గాల్లో ఎన్ని కిలోమీటర్లు నడపాలో ప్రతిపాదనలు రూపొందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ఒకటి రెండు మార్గాల్లో సుమారు 10,000 కిలోమీటర్ల మేర వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సుమారు 6,000 కిలోమీటర్ల మేర అదనంగా ప్రతిపాదించింది. మరికొన్ని మార్గాల్లో సుమారు 10,000 కిలోమీటర్లు తగ్గించుకుంది. ఆ వ్యత్యాసం కూడా సరిదిద్దాల్సిందేనని తెలంగాణ అధికారులు సూచించారు.
తెలంగాణ సూచనలపై ఏపీ అధికారులు మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. శుక్రవారం నాటికి ఆ సవరణలు కూడా చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తరవాత ఒప్పందంపై జరిగే అవకాశం ఉంది. ఆరోజు రాత్రి నుంచే రాకపోకలను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. దసరాకు బస్సులు నడపాలనే దానిపై మాత్రం అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: కేటీఆర్‌ను కలిసిన హీరో రామ్ .. రూ.25 లక్షల విరాళం